ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ


ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు మేలు:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి మండలం లోని చీకురాయి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, డిసెంబర్ 6:- యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలంలోని చీకురాయి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. దాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వాన కాలంలో నాణ్యమైన ధాన్యాన్ని చివరి వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ అక్కడి రైతులతో యాసంగి లో పంట సాగు ప్రణాళిక పై చర్చించారు. యాసంగి లో ఎఫ్ సి ఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయనందున యాసంగి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని అన్నారు. మిల్లర్లు, సీడ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు మాత్రమే వరి పంట వేసుకోవాలని సూచించారు. ఒప్పందం చేసుకోని రైతులు వరి పంట వేసుకుంటే ధాన్యాన్ని సొంతంగానే అమ్ముకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వరికి బదులు మినుములు కందులు, జొన్నలు, నువ్వులు తదితర లాభసాటి పంటలు వేసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి సరిపడా విత్తనాలను రైతులకు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. పంట మార్పిడి కి తగిన సూచనలు సలహాలు కూడా రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తామని కలెక్టర్ అన్నారు. పంట మార్పిడి వల్ల భూమి సారవంతం అవుతుందని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటేనే రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుందని కలెక్టర్ అన్నారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహిస్తుందని, రైతులు దీనిని గమనించి ప్రత్యామ్నాయ సాగు కు సహకరించాలని కలెక్టర్ కోరారు. రైతులు తమ సొంత భరోసాతో మాత్రమే వరి సాగు చేసుకోవాలని కలెక్టర్ స్ప‌ష్టం చేశారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్, జడ్పిటిసి రాంమూర్తి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post