ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పొతంగల్ మండలంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తో కలిసి పరిశీలించారు. మండలంలోని సుంకిని, కొల్లూర్, హెగ్డోలి గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలను సందర్శించి, ధాన్యం సేకరణ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట తడిసిపోయి ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలుపగా, ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేందుకు అనుమతించినందున ఎలాంటి ఆందోళనకు గురికావద్దని కలెక్టర్ వారికి సూచించారు. తడిసిన ధాన్యాన్ని రైతుల నుండి సేకరించి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని కొంగలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఏ దశలోనూ రైతులు నష్టపోకుండా, ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ వెంటదివెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం అనుమతించినందున ఇరవై శాతానికి మించి తడిసిన ధాన్యాన్ని సేకరిస్తూ బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. మిగతా ధాన్యాన్ని రా రైస్ మిల్లులకు పంపించడం జరుగుతోందన్నారు. జిల్లాలో ధాన్యం తరలింపు కోసం 900 వాహనాలను వినియోగిస్తున్నామని, అదనంగా మరో రెండు వందల వాహనాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎక్కడ కూడా ధాన్యం తరలింపులో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, రైతులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నామని అన్నారు. ప్రస్తుత సమయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలువాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించడం జరిగిందని అన్నారు. కలెక్టర్ వెంట జెడ్పిటిసి వెంకట్ పటేల్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహశీల్దార్ విజయలక్ష్మి, జెడ్పి కో-ఆప్షన్ సభ్యుడు సిరాజుద్దీన్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, పొతంగల్ సొసైటీ సీఈఓ భరత్ తదితరులు ఉన్నారు.

—————————————————————————————————————————

Share This Post