ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో అధికారులతో ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 265 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయగా, బుధవారం నాటికి 248 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించబడినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2 వేల 519 రైతుల నుండి 16 వేల 904 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 14 వేల 449 మెట్రిక్ టన్నుల ధాన్యం సంబంధిత మిల్లులకు తరలించామన్నారు. ఇంకనూ ప్రారంభం కాని, కొనుగోలు కేంద్రములను వెంటనే ప్రారంభించాలన్నారు. ప్రతి కొనుగోళ్ళు కేంద్రములో సరిపడు టార్పాలిన్ లు, గోనె సంచులు, తూకం, తేమ శాతం చూసే యంత్రములు అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్ర నిర్వాహకులు రైతుల యొక్క వివరములు ఆన్లైన్ లో ఏరోజుకారోజు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రతి రైస్ మిల్లర్ ధాన్యమును తప్పనిసరిగా దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రైస్ మిల్లర్ తప్పనిసరిగా జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ తో అగ్రిమెంట్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్ళు సజావుగా జరగడానికి వాహనములను సకాలంలో సమకూర్చాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో ఇంచార్జ్ డిఆర్వో టి. శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డీవో వి. లీల, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఎస్. జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ డి.హరికృష్ణ, జిల్లా రవాణాధికారి వై.కొండల్ రావు, డీఆర్డీఓ కె. కౌటిల్య, డిసిఓ బుద్ధా నాయుడు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post