ధాన్యం కొనుగోలు ప్రక్రియను తహశీల్దార్లు ప్రతీరోజూ క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా పర్యవేక్షించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 3: ధాన్యం కొనుగోలు ప్రక్రియను సంబంధిత మండలాల తహశీల్దార్లు తప్పనిసరిగా ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, కొనుగోళ్ళు వేగవంతం అయ్యేలా, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు వేగవంతంగా తరలించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అన్ని మండలాల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు సంబంధిత తహశీల్దార్లు తమ పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, ఏర్పాట్లను పర్యవేక్షించాలని అన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి వాహనాలు అందుబాటులో ఉన్నవి, లేనివి అనే అంశాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ లను, వీఆర్ఓ లను కేంద్రాలకు పంపించి పరిస్థితులను పర్యవేక్షించాలని అన్నారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. సంబంధిత మండల ప్రత్యేకాధికారులు కూడా ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి సరిపడా వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. ఏ కేంద్రంలో వాహనాలు అందుబాటులో లేకపోయినా వెంటనే ఉన్నతాధికారులకు వివరాలు తెలియజేయాలని అన్నారు. అలాగే ధరణి, రెవెన్యూ సమస్యలు, మీసేవ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్ లేకుండా అన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి. లీల, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీసీఓ బుద్ధనాయుడు, డీఏఓ రణధీర్, సిరిసిల్ల తహశీల్దార్ విజయ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు రవికాంత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post