ధాన్యం కొనుగోళ్ళలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్

ధాన్యం కొనుగోళ్ళలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ హరీష్​

మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వడ్లు కొనుగోళ్ళు జరపాలని ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్​ హరీష్​ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఈ యేడు వర్షాకాలం సీజన్​లో జిల్లా వ్యాప్తంగా 11 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అలాగే 30 వేల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అంచనాలు రూపొందించి అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్​ వివరించారు. జిల్లాలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మాయిశ్చరైజ్​ మిషన్లు, ఎలక్ట్రానిక్​ తూకం మిషన్లు, నీటి సదుపాయంతో పాటు రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్​ హరీష్​ ఆదేశించారు. అలాగే రైతులకు సంబంధించిన గన్ని బ్యాగులు అందించాలని, ధాన్యం తరుగు లేకుండా, తాలు లేకుండా చూడాలని కోరారు ధాన్యాన్ని వరుస క్రమంలో కొనుగోళ్ళు చేయాలని ఈ విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. హమాలీలను   మిల్లు  కెపాసిటీ మేరకు ఏర్పాటు చేసుకోవాలని,   ధాన్యం వచ్చిన 24 గంటల లోగా దించుకోవాలని, లారీలను ఎక్కువ పెంచాలని కాంట్రాక్టర్లకు   తెలిపారు.  రైతులకు ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించామని వివరించారు. దీంతో పాటు రైతులు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ వడ్లను విక్రయించాలని… మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని కలెక్టర్​ హరీష్​ కోరారు.

Share This Post