ధాన్యం కొనుగోళ్ళలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి, ఈనెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభం మంత్రి మల్లారెడ్డి,

ప్రచురణార్థం

మేడ్చల్-మల్కాజ్గిరి,  సెప్టెంబర్- 21

 

ధాన్యం కొనుగోళ్ళలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి,

ఈనెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభం,

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ,

చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్ళు చేసే బాధ్యత ప్రభుత్వానిది,

వరి ధాన్యం కొనుగోళ్ళపై సమీక్ష సమావేశంలో మంత్రి మల్లారెడ్డి,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్ళలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వడ్లు కొనుగోళ్ళు  చేయాలని ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించరాదని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

శుక్రవారం శామీర్‌పేటలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం 2022–2023 ధాన్యం కొనుగోళ్ళపై జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 26వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్ళు ప్రారంభిస్తామని దీనికిగాను జిల్లాలో 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. డీసీఎమ్ఎస్ ఆధ్వర్యంలో 6, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 3, ఎఫ్ఏసీఎస్ ఆధ్వర్యంలో 2 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటవెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు.  ప్రస్తుత సీజన్ 45, 450 టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం నిర్ధేశించుకొన్నామని ఇప్పటి వరకు 30 వేట టన్నులు పండినట్లు వ్యవసాయాధికారులు తెలిపారని ఎంత మేర ధాన్యం వచ్చినా కొనుగోళ్ళు చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అన్నదాతలకు మేలు చేయాలని ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,060, మామూలు రకానికి రూ.2,040 మద్దతు ధర అందచేస్తున్నారని ఈ విషయంలో రైతులెవరూ బయట ధాన్యం అమ్మకాలు చేయకుండా మద్దతు ధర ఎక్కువగా వచ్చే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా రైతుల పక్షపాతి అని వారి బాగోతుల కోసం ఎన్ని నిధులైనా వెచ్చించి వారి బాగోతులు చేసే ప్రభుత్వం అని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ళు చేసిన 48 గంటల్లో (రెండు రోజుల్లో)నే వారి ఖాతాల్లోకి నగదు జమ చేయడం జరుగుతుందని ఈ విషయంలో నిధుల కొరత ఏమాత్రంలేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. రైతులకు మంచి చేసే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉండగా ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం ఏమాత్రంలేదని తెలిపారు. ప్రస్తుతం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లోనూ నెంబర్ వన్ స్థానంలో ఉందని అదే విధంగా ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిపే బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉందన్నారు. ఈ విషయంలో అధికారులందరూ సమన్వయంతో ముందుకెళ్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సులువుగా ధాన్యం కొనుగోళ్ళు జరుగుతాయని దీనిని దృష్టిలో ఉంచుకొని పని చేయాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి సూచించారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఈ కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే ధాన్యం రవాణా (ట్రాన్స్పోర్ట్) విషయంలో వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. దీంతో పాటు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు సంబంధించి వరుస క్రమంలో టోకెన్ పద్దతిని ఏర్పాటు చేయాలని ధాన్యాన్ని తూకం వేసిన తర్వాత అదే క్రమపద్దతిలో సంబంధిత సిబ్బంది ట్యాబ్‌లలో ఎంట్రీ చేయాలని అలాగైతే వారికి డబ్బులు సమయానికి వస్తాయని ఈ విషయంలో ఎంట్రీ చేయకుండా నిర్లక్ష్యం వహించరాదని ఆయన సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 11 కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యంతో పాటు రైతులకు సంబంధించి టార్ఫాలిన్లు, తూకం (వేయింగ్) మిషన్లు, ప్యాడీక్లీనర్లను  అందించేలా చూడాలని ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలనే దృఢసంకల్పంతో ఉన్నందున ఈ విషయంలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ ఈ యేడు వర్షాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా 11 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని  అలాగే జిల్లా వ్యాప్తంగా 45,450 టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి లక్ష్యం నిర్ధేశించుకోగా అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మాయిశ్చరైజ్ మిషన్లు, ఎలక్ట్రానిక్ తూకం మిషన్లు, నీటి సదుపాయంతో పాటు రైతులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ హరీష్ ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రాల నుంచి తీసుకువచ్చేందుకు గోనె సంచులకు ఎలాంటి ఇబ్బందిలేదని సరిపడా సంచులు ఉన్నాయని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. రైతులకు తీసుకువచ్చి తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే లారీల ద్వారా ట్రాన్స్‌పోర్టు చేసి తరలించేలా చూడాలని అందుకు సంబంధించి అవసరమైన హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ విషయంలో ఏమాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా చెడ్డపేరు వస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకొని మార్కెటింగ్ శాఖ అధికారులు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, రైసుమిల్లుల యాజమాన్యాల వారు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. అలాగే రైతులకు సంబంధించిన ధాన్యాన్ని వరుస క్రమంలో కొనుగోళ్ళు చేయాలని ఈ విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తప్పవని కేంద్రానికి ఒక అధికారిని నియమించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ సూచించారు.  రైతులకు ధాన్యం కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించామని మరికొన్ని చోట్ల కూడా మిగిలిన ఏర్పాట్లు చేస్తామని వివరించారు. దీంతో పాటు రైతులు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తమ వడ్లను విక్రయించాలని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని కలెక్టర్ హరీశ్ కోరారు. అనంతరం వరి పంటకు మద్దతు ధరకు సంబంధించి గోడపత్రిక, కరపత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నందారెడ్డి,  డీసీఎమ్ఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసమూర్తి, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రాజేందర్, ఆర్డీవో రవి, ఫీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి,జిల్లాలోని రైసుమిల్లుల యజమానులు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు, రైతు అనుబంధ సహకారంసంఘాల సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post