ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం చేయవద్దు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉంటే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 04: రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం తగదని, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, అంకిరెడ్డిపల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తంగళ్ళపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 77 మంది రైతుల వద్ద నుండి 7 వేల 781 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, కొనుగోలు ధాన్యంలో 7 వేల 146 క్వింటాళ్ల ధాన్యం రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. అలాగే అంకిరెడ్డిపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో 124 మంది రైతుల వద్ద నుండి 9 వేల 492 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, అందులో నుండి 9 వేల 92 క్వింటాళ్ల ధాన్యం ఇప్పటికే రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. కొనుగోలు కేంద్రంలో సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ అన్నారు. స్థానికంగా ఉన్న రైతులతో మాట్లాడి వచ్చే సీజన్ లో ఏ పంటలు వేస్తున్నారని వారి అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనం పరిశీలన
తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి పరిశీలించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శిని ఎన్ని మొక్కలు నాటింది అడిగి తెలుసుకున్నారు. నాటిన మొక్కలన్నీ వంద శాతం బ్రతికేలా సంరక్షణా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రం తనిఖీ
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామ గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. ఆరోగ్య సిబ్బందిని ఎంత మందికి ఈ కేంద్రం ద్వారా వ్యాక్సినేషన్ చేసింది అడిగి తెలుసుకున్నారు. రెండవ డోస్ కు అర్హులై కూడా ఇంకా వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి, అవగాహన కల్పించి, వారికి వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, ఎంపీడీఓ లచ్చాలు, పౌర సరఫరాల ఉప తహశీల్దార్ ఎలుసాని ప్రవీణ్, ఏపీఎం పర్శరాములు, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post