*ధాన్య రవాణాకు పటిష్ట ఏర్పాట్లు:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ధాన్య రవాణాకు పటిష్ట ఏర్పాట్లు:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 22: ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం ఎప్పటికప్పుడు గోడౌన్లకు రవాణా అయ్యేలా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అధికారులతో ధాన్య కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 265 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు మంజూరు ఇవ్వగా, ఇప్పటికి 252 కేంద్రాలు ప్రారంభించబడ్డట్లు ఆయన తెలిపారు. ఇంకనూ ప్రారంభించని కేంద్రాలు వెంటనే ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రారంభించబడిన కేంద్రాల్లో240 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ జరిగినట్లు, ఆదివారం నాటికి 11 వేల 795 మంది రైతుల నుండి రూ. 149 కోట్ల 26 లక్షల విలువగల 76 వేల 151 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 69 వేల 579 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గోడౌన్లకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికి ఒక వేయి 724 మంది రైతులకు రూ. 16 కోట్ల 6 లక్షలు వారి వారి ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమచేసినట్లు ఆయన అన్నారు. ఇప్పటికి 4 వేల 453 మంది రైతుల డాటా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినట్లు, మిగులు రైతుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్లలో వేగం పెంచాలన్నారు. కేంద్ర బాధ్యులు కొనుగోలు చేసిన ధాన్య ట్రక్ షీట్లను వెంట వెంటనే ఆన్లైన్లో అప్ లోడ్ చేసేలా చూడాలన్నారు. తహశీల్దార్లు వారి వారి మండలాల్లోని మిల్లులను సందర్శించి, అన్లోడ్ పరిస్థితి, ఎంతమంది లేబర్లు ఉన్నది నివేదిక సమర్పించాలన్నారు. టార్పాలిన్లు సరిపోను ఉన్నది, తూకం, తేమ యంత్రాలు అన్ని కేంద్రాల్లో పనిచేయుచున్నది లేనిది కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అందుబాటులో ప్రభుత్వ, ప్రయివేటు అన్ని రకాల గోడౌన్లను ధాన్య నిల్వకు ఉపయోగించాలన్నారు. ధాన్య రవాణాకు వాహనాల పర్యవేక్షణకు మండలాల వారిగా ఎక్సైజ్ సిబ్బందిని కేటాయించాలన్నారు. రవాణా అవసరాన్ని బట్టి వాహనాన్ని వెంటనే పంపించే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. యాసంగి సిఎంఆర్ బియ్యం లక్ష్యం వెంటనే పూర్తి చేయాలన్నారు.

ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీఆర్డీఓ కె. కౌటిల్య, డీఏఓ రణధీర్, డీసీఓ బుద్ధనాయుడు, డీటీఓ కొండల్ రావు, మెప్మా పిడి భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share This Post