నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగింపు కు 72 గంటల ముందు నేటితో ప్రచారం బంద్ : రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

ఈ నెల 10 న జరగనున్న స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి  ఎన్నికల పోలింగ్ ముగింపు సమయం  72 గంటల ముందు  నేడు డిసెంబర్ 7  సాయంత్రం నాలుగు గంటల నుండి అభ్యర్థులు,రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం  నిలుపుదల చేయాలని రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జీవన్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల  పోలింగ్ కు 72 గంటల ముందు అనగా డిసెంబర్ 07 సాయంత్రం 4-00 గంటల నుండి డిసెంబర్ 10 పోలింగ్ ముగిసే వరకు నిశబ్ధ కాలం (సైలెన్స్ పిరియడ్) అని ఆయన తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం – 1951 సెక్షన్ (126) ప్రకారం ఎన్నికల ప్రచారానికి సంబంధించి రాజకీయ పార్టీలు, మీడియా కార్యక్రమాలు నిర్వహించరాదని, ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సినిమాటోగ్రాఫీ, టెలివిజన్, ప్రచార సామాగ్రి ప్రజలకు తెలిపే విధంగా ప్రదర్శించరాదని అన్నారు. మ్యూజికల్ కచేరిలు, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారికి  రెండు సంవత్సరముల వరకు జైలు శిక్షతో పాటు లేదా  ఫైన్ విధించబడునని లేక రెండు శిక్షలను విధించబడునని ఆయన తెలిపారు.

Share This Post