నల్గొండ స్థానిక సంస్థల ఎం.ఎల్.సి. ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి*

రేపు డిసెంబర్ 14 న జరుగనున్న నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. సోమవారం జిల్లా మహిళా సమాఖ్య భవనంలో నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నిక ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను డి.ఐ. జి. ఎస్.పి ఏ.వి.రంగనాథ్ తో కలిసి పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డి.ఐ.జి. ఎస్.పి. ఏ.వి.రంగనాథ్ లు కౌంటింగ్, భద్రతా పరమైన  ఏర్పాట్లు పరిశీలించి సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ననుసరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కోవిడ్ డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకొని గుర్తింపు కార్డు ఉన్న వారినే కౌంటింగ్ కు అనుమతించ నున్నట్లు తెలిపారు. డబుల్ డోస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేనిచో కౌంటింగ్ కేంద్రం ప్రవేశం వద్ద వున్న కోవిడ్ పరీక్షా కేంద్రం వద్ద కోవిడ్ పరీక్ష లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే అనుమతించ నున్నట్లు తెలిపారు. రేపు జరుగనున్న కౌంటింగ్ కు ముందస్తుగా రిహార్సల్స్ నిర్వహించారు.         జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 14న ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6:30 కల్లా కౌంటింగ్ కేంద్రంలో రిపోర్టు చేయాలని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమం ప్రకారం ఓటర్లు ఓటు వేస్తారని, కాబట్టి కౌంటింగ్ లో భాగంగా మొదట ప్రారంభ లెక్కింపు చేపడతామన్నారు. కౌంటింగ్ కోసం నాలుగు టేబుల్ లను ఏర్పాటు చేశామన్నారు  ప్రారంభం లెక్కింపులో మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. ప్రారంభ లెక్కింపు అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మొదటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కిస్తామని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావలసిన కోటాను నిర్ధారిస్తామని అన్నారు. ఎవరైనా అభ్యర్ది కోటాకు సరిపడు ఓట్లను సాధించినట్లయితే అతనిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తామని, ఏ అభ్యర్థికీ కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే తదుపరి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతామని అన్నారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాను సాధించేవరకు చేపడతామన్నారు. ఏ అభ్యర్థికీ కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి,నల్గొండ తహశీల్దార్ నాగార్జున రెడ్డి, మాస్టర్ ట్రైనర్ తరాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post