నష్ట నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

నష్ట నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 6: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా వుంటూ, నష్ట నివారణకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం అధికారులతో వర్షాల పట్ల తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా చెరువులు, క్యాజ్ వేల పరిస్థితి, తెగే పరిస్థితి వస్తే, ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అంతటా భారీ వర్షాలు కురుస్తుండగా, అతి భారీ వర్ష జాబితాలో జనగామ జిల్లా ఉందన్నారు. ఇప్పటికే జఫర్ గఢ్ లో 10 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదయినట్లు ఆయన అన్నారు. గత భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని, లోతట్టు ప్రాంతాలు, ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పునరావాస కేంద్రాలు, రిలీఫ్ కేంద్రాలు గుర్తించి, లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను తరలించే చర్యలు తీసుకోవాలని అన్నారు. గత అనుభవాల దృష్ట్యా లోతట్టు రహదారులు, వంతెనలు ప్రమాదాకారిగా మారే అవకాశం ఉన్నచోట రాకపోకలు స్తంభింపజేసి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీసు, పంచాయతీ సిబ్బందిని రక్షణగా పెట్టి ఎటువంటి వాహనాలను అనుమతించకూడదని అన్నారు.
నీటిపారుదల, రెవిన్యూ శాఖల సిబ్బంది సమన్వయంతో ప్రతి చెరువు, నీటివనరులను పర్యవేక్షణ చేయాలని, నీటి మట్టాల స్థాయిని గమనిస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతిచోట బాధ్యతాయుత సిబ్బందిని కాపలాగా ఉంచాలన్నారు. ఎక్కడైనా నీటి వనరుల నుండి నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తే, ముందస్తుగా తెలపాలని, ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా లోతట్టు ప్రభావిత ప్రాంతాల ప్రజలను తరలింపుకు చర్యలు చేపట్టాలని అన్నారు. భారీ వర్షాలకు చెరువులు, నీటి వనరులకు గండ్లు పడే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో చేపలు పట్టడానికి, ఇతరాలకు ఎవ్వరిని అనుమతించకూడదని కలెక్టర్ అన్నారు. పంచాయతీ, రెవిన్యూ సిబ్బందిచే గ్రామాల్లో టామ్ టామ్ ద్వారా ప్రజలు బయటకు రాకుండా, జాగ్రత్తలపై ప్రచారం చేయాలన్నారు. లూజ్ వైర్లు, దెబ్బతిన్న కరంట్ స్తంభాలు గుర్తించిన చోట వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయిన చోట వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో వారిని ముందస్తుగా సురక్షిత చోటుకి తరలించాలని, వారికి వేరే ప్రదేశం లేనప్పుడు పునరావాస కేంద్రం, రిలీఫ్ కేంద్రాలకు గాని తరలించాలని అన్నారు. ఎంపిడివో, ఎంపీవో, పర్యవేక్షకులు ఇతర అధికారులతో 5 బృందాలుగా ఏర్పడి, ఆయా మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం పకడ్బందీగా చేపట్టాలని, వ్యాధుల పట్ల అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వర్షాలతో నష్టం వాటిల్లిన ఇండ్లు, పంట వివరాల సమర్పించాలన్నారు. అధికారులు ప్రధాన కార్యస్థానంలోనే ఉండాలని, 24 గంటలు అప్రమత్తంగా ఉండి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రజల్ని అప్రమత్తం చేస్తూ నష్టం నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో డిసిపి శ్రీనివాస రెడ్డి, అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, నీటిపారుదల శాఖ ఎస్ఇ యశస్వి, నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, డిపివో రంగాచారి, ఎంపిడివోలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది

Share This Post