నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లాలో గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాలు తయారు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎక్సైజ్, పోలీస్ మరియు లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్తు పదార్థాల కట్టుదిట్టమైన నియంత్రణకై జిల్లా ఎస్పీ డా.వై. సాయిశేఖర్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ తో కలిసి లైన్ డిపార్ట్మెంట్ లతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుడుంబా తయారీ, గంజాయి సాగు, గుట్కా ఇతర చట్ట వ్యతిరేక మత్తు పానీయాల తయారీని ఉక్కుపాదంతో అణచివేసేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్ లు కలిసి పనిచేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణాధికారులకు తెలియకుండా గంజాయి సాగు ఎలా అవుతుందా అని వ్యవసాయ అధికారిని ప్రశ్నించారు. అదేవిధంగా గుడుంబా తయారీ విషయములో పంచాయతీ సెక్రెటరీ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. ఎక్కడైనా గంజాయి సాగు జరిగినట్లు తెలిస్తే వారిని అరెస్ట్ చేసి బైండోవర్ కేసులు పెట్టాలని, అవసరమైతే పి.డి యాక్టు పెట్టాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. గంజాయి సాగు చేసిన వ్యక్తిపై బైండోవర్ కేసు నమోదు చేయడమే కాకుండా అట్టి రైతుకు రైతు బంధు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారిని, పంచాయతీ సెక్రెటరిని వివరణకోరుతూ మెమోలు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాలు తయారు చేయకుండా వాటి దుష్పరిణామాలపై కళాజాత బృందాల ద్వారా ప్రచారం కల్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు. సబ్ డివిజన్ స్థాయిలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించుకోవాలని ఆయా ప్రాంతాల్లో మత్తు పదార్థాలు తయారీ పై నిఘా ఉంచి మూకుమ్మడిగా దాడులు నిర్వహించాలని సూచించారు. ఇక నుండి ప్రతి 15 రోజులకు జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేసారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ వై. సాయిశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి, గుడుంబా, గుట్కా, గ్యాంబ్లింగ్ పై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలో చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మత్తు పదార్థాలు తయారు చేసే వారు లేదా ప్రోత్సహించే వారు ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. సంబంధిత డిపర్ట్మెంట్లలో కొందరు ఇంటి దొంగలు ఉంటారని అలాంటి వారిని ముందు గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల యువత భవిష్యత్తు నాశనమైపోతుందని ఇందులో అధికారుల పిల్లలు సైతం ఉండవచ్చు కాబట్టి తమ పిల్లల పై నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులను కోరారు. జిల్లాలో మత్తు పదార్థాలు తయారు చేసే, వాడే వారి నెట్వేర్క్ ను తెలుసుకొని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిలా పోలీస్ శాఖ తరపున మత్తు పదార్థాల తయారీదారులపై ఉక్కుపాదం మోపేందుకు అన్ని సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ యాసిన్ ఖురేషి మాట్లాడుతూ జిల్లాలో మత్తు పదార్థాలు తయారు చేసేవారిని నియంత్రించేందుకు పోలీస్, అటవీ, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ శాఖల సహాయ సహకారాలు అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దోషులపై రైడింగ్ సమయంలో, వారిని అరెస్టు చేయడం, కేసులు వేసే సందర్భాల్లో పోలీస్ శాఖ సహాయం అవసరముందని కోరారు. అదేవిధంగా బైండోవర్ కేసు సమయంలో రెవెన్యూ శాఖ, క్షేత్ర స్థాయిలో వ్యవసాయ, అటవీ శాఖ, పంచాయతీ రాజ్ శాఖాధికారుల సహకారం కావాలని కోరారు.
స్పందించిన కలెక్టర్ అన్ని శాఖల సహాయ సహకారం ఉంటుందని సబ్ డివిజన్ స్థాయిలో ఎప్పటికప్పుడు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఎక్కడ చట్ట విరుద్ధంగా మత్తు పదార్థాల తయారీ గాని వినియోగం జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అసనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సూపరిండెంట్ దత్తురాజ్ గౌడ్, వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, డిపిఓ రాజేశ్వరి, ఆర్డీవోలు నాగలక్ష్మి, హనుమ నాయక్, పాండు నాయక్, రాజేష్ కుమార్, డిఎస్పీలు మోహన్ రెడ్డి, గిరిబాబు, నర్సింహులు, టాస్క్ఫోర్స్ సి.ఐ పరమేశ్వర గౌడ్, ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు తదితర అధికారులు పాల్గొన్నారు.

Share This Post