నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తా జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన
తేది: 29-3-2023
నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఓయ్. ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ అక్కడ వైద్య సిబ్బంది, ఆసుపత్రికి వచ్చే రోగులకు కలుగుతున్న అసౌకర్యాల పై ఆరాతీశారు. దాదాపు రెండు గంటల పాటు ఆసుపత్రి మొత్తం కలియతిరుగుతూ ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు అప్పగించినందున రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఆసుపత్రి భవనంలో ఇంకా కొన్ని విభాగాలకు సరైన వసతులు లేవు అన్న విషయాన్ని కలెక్టర్ తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రతి సోమవారం, బుధవారం గర్భిణీలు ఏ.ఎన్. సి చెకప్ కు అధిక సంఖ్యలో రావడం, లేబొరేటరీ పరీక్షలు, ప్రసవాలు సంఖ్య పెరగడం, క్యాజువాలిటి, ఎమర్జెన్సీ వార్డుల్లో సరైన రోగుల సంఖ్య పెరగటంతో స్థలాభావం వంటివి పరిశీలించారు. ఆర్.ఎం.ఓ లు, స్టాఫ్ నర్స్ లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సరిపడ నర్సింగ్ స్టేషన్లు లెవని, డ్రెస్ మార్చుకునే గదులు, నర్సింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్న పిల్లలకు టీకాలు ఇచ్చే ముందు భాగంలోనే ఎక్సరే రూమ్ ఉండటం పక్కనే స్కానింగ్ రూమ్ వంటివి ఉండటం ఇబ్బందికరమని కలెక్టర్ గ్రహించారు. ఎక్సరే గది మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. అదేవిధంగా ఎన్ని కౌంటర్లు అవసరం ఉన్నాయి, నర్సింగ్ సెంటర్లు ఎన్ని ఎక్కడెక్కడ కావాలి, ఎన్ని బిరువాలు కావాలి అనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రికి తూర్పున ఉన్న ఖాళీ స్థలంలో మురికిగా ఏర్పడి పందులు విహరిస్తున్న అంశాన్ని గ్రహించిన ఆయన మున్సిపల్ సిబ్బందిని పిలిపించి వెంటనే ఏరియా మొత్తం శుభ్రం చేసి పైన గ్రీన్ మ్యాట్ వేయాలని అక్కడ వాహనాలు ఆపేందుకు పార్కింగ్ స్థలం గా ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ముందుభాగంలో వాహనాలు పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన వైద్య సిబ్బందిని సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వచ్చే రోగులకు మాత్రం పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
అసిస్టెంట్ సూపరిండెంట్ డా. సూర్యనారాయణ, డి.సి.హెచ్. డా. రమేష్ చంద్ర,ఆర్.ఎం.ఓ లు డా. దశరథం, డా. బలరాం, డా. అజీమ్ ఇతర వైద్య సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
—————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ

Share This Post