నిరుపేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం…
టిఫ్ఫా స్కాన్ సెంటర్ ఏర్పాటుతో గర్భిణీలకు అండ
సీఎం కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలోనూ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు
రోగులకు తెలిసేలా ప్రభుత్వ వైద్య సేవలపై బోర్డులు ఏర్పాటు చేయాలి
– టిఫ్ఫా స్కానింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
నిరుపేదలకు అత్యాధునికమైన వైద్య సేవలు ఉచితంగా అందించి వారికి అండగా నిలబడాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని… అందుకే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించక పోయినా ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఏర్పాటుచేసిన రెండు అధునాతన టిఫ్ఫా స్కానింగ్ యంత్రాలను మంత్రి ప్రారంభించారు.
70 ఏళ్లుగా ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వాలు వైద్య అభివృద్ధికి కనీసం చర్యలు తీసుకోలేదని, ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను మహబూబ్ నగర్ లోనే ప్రారంభించుకున్నామని తెలిపారు.
టిఫ్ఫా స్కానింగ్ కోసం ప్రైవేట్ దవాఖానాల్లో రూ. 3వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేయడం వల్ల పేద గర్భిణి స్త్రీలపై భారం పడకుండా కాపాడే అవకాశం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ దవాఖానలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ టిఫ్ఫా స్కానింగ్ సెంటర్ గురించి అందరికీ తెలిసేలా ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలియక ప్రైవేటు దవాఖానాల్లో స్కానింగ్ కోసం వెళ్లే గర్భిణీలకు ఈ సమాచారం పత్రికల ద్వారా తెలియజేయలన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ వైద్య సేవలు అండగా నిలిచేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
కరోనా వ్యాక్సిన్, మల్టీ డ్రగ్స్ తయారీలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండి ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తున్న తెలంగాణకు అండగా ఉండాల్సిన కేంద్రం… ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధి చెందకుండా కుట్రలు చేస్తోందని మంత్రి విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల కూడా కేటాయించకపోవడం ఎందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చన్నారు.
జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ డా. రామ్ కిషన్, జిల్లా వైద్యాధికారి డా. శశికాంత్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. జీవన్, ఆర్ఎంవో డా. మొహమ్మద్ సిరాజుద్దీన్, దవాఖాన అభివృద్ధి కమిటీ సభ్యులు సత్యం యాదవ్, లక్ష్మి, గైనిక్ విభాగం హెచ్ఓడి డా.రాధ, కౌన్సిలర్లు షబ్బీర్, కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.