నుడా మాస్టర్ ప్లాన్ ముసాయిదా వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూసుకోవాలి అధికారులను ఆదేశించిన కలెక్టర్ మూడు రోజుల్లోగా పరిశీలనను పూర్తి చేయాలని సూచన

నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ (నుడా) ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సరిచూసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. మూడు రోజుల్లోపు పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి సమగ్ర వివరాలతో తదుపరి నిర్వహించే సమావేశానికి రావాలని సూచించారు. నుడా మాస్టర్ ప్లాన్ బృహత్ ప్రణాళిక ముసాయిదాపై కలెక్టర్ నగరపాలక సంస్థతో పాటు అటవీ, రెవిన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ తదితర శాఖల అధికారులతో గురువారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముసాయిదా మాస్టర్ ప్లాన్ ను గత మార్చ్ నెల 1 వ తేదీన నోటిఫై చేయడం జరిగిందన్నారు. పక్షం రోజుల గడువు కల్పిస్తూ, దీనిపై ప్రజల నుండి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఆహ్వానించడం జరిగిందన్నారు. ప్రజల అభ్యర్థన మేరకు గడువును మరో పక్షం రోజులు పొడిగిస్తూ, మార్చి నెలాఖరు వరకు అభ్యంతరాలు స్వీకరించామని వివరించారు. ఈ సందర్భంగా మొత్తం 760 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో నుడా పరిధిలో 260 , నగరపాలక సంస్థ పరిధిలో 500 అభ్యంతరాలు వచ్చాయన్నారు. వీటిని క్రోఢీకరించగా, 144 అంశాలకు సంబంధించిన అభ్యంతరాలు ప్రజల నుండి వచ్చినట్లు తేలిందన్నారు. వీటి విషయమై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు అయితే ముసాయిదా ప్రతిపాదనను ఆమోద కోసం ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుతం రూపొందించిన ముసాయిదా లో ఆయా శాఖలకు సంబంధించిన భూములు, చెరువులు, కుంటలు, కాల్వలు, ఇతర ఆస్తుల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించుకోవాలని, అవసరమైతే సర్వే చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామం, సర్వే నెంబర్, విస్తీర్ణం వంటి వాటిని నిశితంగా పరిశీలన జరపాలని, ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం కల్పించినా, తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పక్కాగా పరిశీలన చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశం లో నగర పాలక సంస్థ కమిషనర్ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
————————

Share This Post