నూతనంగా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి తీర్మానాలు స్వీకరించి గ్రౌండింగ్ చేయాలి :: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్

ప్రచురణార్థం-4
రాజన్న సిరిసిల్ల, జనవరి 28: జిల్లాలో నూతనంగా ఈజీఎస్ ద్వారా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి, సంబంధిత గ్రామాల సర్పంచుల నుండి తీర్మానాలు స్వీకరించి, గ్రౌండింగ్ చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్, పంచాయితీ, గ్రామీణాభివృద్ధి విభాగాల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గంభీరావుపేట మండలానికి 5 కోట్ల 10 లక్షలు, ముస్తాబాద్ మండలానికి 4 కోట్ల 70 లక్షలు, తంగళ్ళపల్లి మండలానికి 6 కోట్లు, వీర్నపల్లి మండలానికి 3 కోట్ల 80 లక్షలు, ఎల్లారెడ్డిపేట మండలానికి 5 కోట్ల 40 లక్షలు, చందుర్తి మండలానికి 99 లక్షలు, కోనరావుపేట మండలానికి 1 కోటి 55 లక్షలు, రుద్రంగి మండలానికి 1 కోటి 27 లక్షలు, వేములవాడ రూరల్ మండలానికి 82 లక్షలు, వేములవాడ అర్బన్ మండలానికి 64 లక్షల రూపాయలు సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఈజీఎస్ ద్వారా మంజూరు అయ్యాయని తెలిపారు. వీటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి సంబంధిత గ్రామాల సర్పంచుల నుండి తీర్మానాలు స్వీకరించి, గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను సంబంధిత అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో ప్రగతిలో ఉన్న పలు పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు. నిర్మాణం పూర్తయిన వైకుంఠధామాల చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో పంచాయితీ రాజ్ ఎస్ఈ సుదర్శన్, డీపీఓ రవీందర్, డీఆర్డీఓ కె. కౌటిల్య, పంచాయితీ రాజ్ డీఈ, ఏఈ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post