నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి :: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 3:

ప్రజలను నాణ్యమైన, సత్వర సేవలు ఒకే దగ్గర అందించాలని, పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పరిశీలించారు. మంత్రి జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా పనులు అసంపూర్తిగా ఉండటాన్ని గమనించి సంభందిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో వచ్చినప్పటికి ఇప్పటికీ పురోగతి లేదని పనుల్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణం, లోపల జరుగుతున్న పనులను పరిశీలించారు. నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని రూ. 44 కోట్లతో 1,69,000 వేల చ.అ. విస్తీర్ణంలో చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటికే మెయిన్‌ బిల్డింగ్‌ స్లాబ్లు నిర్మాణ పనులు పూర్తి కాగా, సివిల్ పనులు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. పలు గదులు ఇప్పటికే ఫ్లోరింగ్ పనులు సైతం పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. భవనం మొత్తం తిరిగి విద్యుత్‌ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్‌, టైల్స్‌ పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. పనులను మరింత వేగంగా చేపట్టాలని ఆదేశించారు.

మంత్రి పర్యటన సందర్భంగా ఆర్ అండ్ బి ఎస్ఇ. లక్ష్మణ్ , ఇఇ శ్యామ్ ప్రసాద్, అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Post