నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్

పత్రిక ప్రకటన

తేదీ : 16–08–2022

నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్
ముఖ్యమంత్రి కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి
కార్యక్రమాలను విజయవంతం చేసేలా అన్ని రకాల చర్యలు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా షామీర్పేటలోని అంతాయిపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించనున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద్, జిల్లా కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, బాలానగర్ డీసీపీ సందీప్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను వారు పరిశీలించి వివరాలను తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రూ.56.20 కోట్లతో ముప్పై ఎకరాల్లో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీని ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి లోటుపాట్లు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2.55 గంటలకు షామీర్పేటలోని అంతాయిపల్లి వద్దకు చేరుకొని నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాలన్ని ప్రారంభించి అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని అన్నారు. వీఐపీలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా నిర్వహించాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని వర్షం కురిసినప్పటకీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం పార్కింగ్ స్థలం మొదలుకొని సభ ప్రాంగణం, వేదికలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ సీఎం రాక నుంచి సభ ముగింపు వరకు ముందస్తుగానే కార్యాచరణ ప్రకారం సంబంధిత జిల్లా అధికారులకు ఆయా పనులను అప్పగించామని అందుకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభను విజయవంతం చేయడం జరుగుతుందని వివరించారు.

Share This Post