నెలాఖరులోగా వైకుంఠధామం నిర్మాణం పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల, జనవరి 18: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ వైకుంఠధామ నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని కలెక్టర్ కు సంబంధిత అధికారులు వివరించారు. అలసత్వం ప్రదర్శించకుండా తుది దశ నిర్మాణ పనుల్లో వేగం పెంచి వైకుంఠధామంను పూర్తి స్థాయిలో నిర్మించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రగతిలో ఉన్న చెక్ డ్యాంల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి
నిర్మాణ ప్రగతిలో ఉన్న చెక్ డ్యాంలను త్వరితగతిన పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్, ఓల్డ్ అర్బన్ కాలనీల్లో నిర్మిస్తున్న చెక్ డ్యాంల పురోగతిని నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 24 చెక్ డ్యాంల నిర్మాణాలు ప్రగతిలో ఉన్నాయని, అందులో వేములవాడ మూలవాగు మీద 13, సిరిసిల్ల మానేరు వాగు మీద 11 చెక్ డ్యాంలు ఉన్నట్లు తెలిపారు. ఈ వేసవికాలంలోగా అన్ని చెక్ డ్యాంల నిర్మాణాలను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. తిప్పాపూర్, ఓల్డ్ అర్బన్ కాలనీల్లో నిర్మిస్తున్న చెక్ డ్యాంలకు సంబంధించి ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. మిగిలిన పనులను వేగవంతం చేయాలని, పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సందర్శనలో కలెక్టర్ వెంట నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, డీఈఈ లు, తదితరులు ఉన్నారు.

Share This Post