ప్రచురణార్ధం
అక్టోబరు,07,ఖమ్మం: –
నేటి సమాజంలో దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణిస్తూ సమాజానికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బి.హెచ్.ఇ.ఎల్ సౌజన్యంతో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం టి.ఎన్.జి.ఓస్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల బహుకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందజేశారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక శిభిరాల ద్వారా ఎంపిక చేసిన సుమారు 2 వందల మంది దివ్యాంగులకు సుమారు 24 లక్షల విలువైన 443 సహాయ ఉపకరణాలను బి.హెచ్.ఇ.ఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ వసంతరాయ్ జాదవ్ తో కలిసి కలెక్టర్ లబ్దిదారులకు అందజేసారు. ఈ సందర్భంగా దివ్యాంగులనుద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన బి. హెచ్.ఇ.ఎల్ తమకు వచ్చిన లభాలలో కొంతశాతం వాటాను కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద అందజేయడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల సహాయ ఉపకరణాలు సహజ జీవితానికి తోడ్పాటుగా ఉంటాయని, దివ్యాంగులు తమ రోజువారీ కార్యక్రమాలతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్నారని, ముఖ్యంగా ఇటీవలే దివ్యాంగులకు జరిగిన ఓలపింక్ క్రీడలలో సాధారణ క్రీడాకారుల కంటే అధికంగా దివ్యాంగ క్రీడాకారులు సుమారు 2 వందల మె డ ల్స్ సాధించారని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. వికలాంగత్వం ఉందని నిరాశ పడకుండా తపన, పట్టుదల, కృషితో అన్ని రంగాలలో మరింతగా రాణించాలని కలెక్టర్ కోరారు.
బి.హెచ్.ఇ.ఎల్ అడిషనల్ జనరల్ మేనేజర్ వసంతరావు జాదవ్ మాట్లాడుతూ పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని, సమాజంలోని దివ్యాంగులకు సహాయ పడేందుకు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద బి.హెచ్.ఇ.ఎల్ అవసరాలు గుర్తించి తదనుగుణంగా సమాజానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఎంపికచేసిన లబ్దిదారులకు 51 ట్రైసైకిల్స్, 26 వీల్ చైర్స్, 19 రోలెటర్స్, 130 క్రెచెస్, 20 వాకింగ్ స్టిక్స్, 136 డిజిటల్ వినికిడి పరికరాలు, 29 కాలికెల్స్, 18 లింబ్స్ వంటి మొత్తం 443 సహాయ ఉపకరణాలను అందిస్తున్నట్లు తెలిపారు.
అలిమ్ల్ కో మేనేజర్ కె.వి. రాజేష్ మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను తెలుసుకొని వారికి అండగా నిలిచేందుకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్ళేందుకు ట్రైసైకిల్స్, వినికిడితనం కలిగిన వారికి వినికిడి పరికరాలు, అదేవిధంగా ఇతర వికలాంగత్వం కలిగిన వారికి వారి అవసరాలకనుగుణంగా సహాయ ఉపకరణాలను బి. హెచ్.ఇ.ఎల్ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా సంక్షేమ శాఖాధికారి సంధ్యారాణి, బి.హెచ్.ఇ.ఎల్ మేనేజర్ రాజేష్, జిల్లా సంక్షేమశాఖ కార్యాలయపు సిబ్బంది, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.