నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు:: వరంగల్ పోలిస్ కమీషనర్ డా. తరుణ్ జోషి

నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు:: వరంగల్ పోలిస్ కమీషనర్ డా. తరుణ్ జోషి

జనగామ, సెప్టెంబర్ 8: సీసీ కెమెరాల వల్ల నేరాలు జరగకుండా నియత్రించవచ్చని వరంగల్ పోలిస్ కమీషనర్ డా. తరుణ్ జోషి అన్నారు. బుధవారం రఘునాధపల్లి పోలిస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన 118 సిసి కెమెరాలను జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తో కలిసి పోలీస్ కమీషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానంతోనే నిరంతర నిఘా సాధ్యమవుతుందని అన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘాకు సిసి కెమరాలు ఎంతో కీలక ప్రాత వహిస్తాయని, వ్యక్తుల కదలికలను పరిశీలించడానికి ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సిసి కెమెరాలను ఎంతోగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. చాలా నేరాల్లో నిందితులు దోషులుగా రుజువు కావడానికి సీసీ కెమెరాల సాక్ష్యం ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానమని, 24 గంటలు, 365 రోజులు నిర్విరామంగా నిరంతరాయంగా సీసీ కెమెరాలు పనిచేస్తాయని తెలిపినారు. ప్రజల, పోలీసుల మధ్య సమన్వయంతోనే నేరాలు నియంత్రణ సాధ్యపడుతుందని పోలిస్ కమీషనర్ తెలిపినారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సిసి కెమెరాలు ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి ఉపకరిస్తాయన్నారు. సిసి కెమరాలతో ప్రజలకు మరింత భద్రత కల్పించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల రక్షణకు, దొంగతనాలు అరికట్టడానికి, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
సిసి కెమెరాల ఏర్పాటు కోసం 8 లక్షల రూపాయల విరాళం అందించి ప్రజలు భాగస్వామ్యం కావడం ఎంతో అభినందనీయమని తెలుపిన పోలిస్ కమీషనర్, విరాళం అందించిన పలువురిని శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డిసిపి బి. శ్రీనివాస రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఏసిపి వైభవ్ రఘునాద్ గైక్వాడ్, జనగామ ఏసిపి వినోద్ కుమార్, పోలిస్ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post