న్యాయ వ్వవస్థ పట్ల ప్రజా విశ్వాసం సంరక్షణకు కృషి చేయాలి – రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్

న్యాయ వ్వవస్థ పట్ల ప్రజా విశ్వాసం సంరక్షణకు కృషి చేయాలి – రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్

ప్రచురణార్థం

న్యాయ వ్వవస్థ పట్ల ప్రజా విశ్వాసం సంరక్షణకు కృషి చేయాలి – రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్

*ప్రతి పౌరుడికి అందుబాటులో న్యాయ వ్యవస్థ

*కోర్టు ప్రోసిడింగ్స్ స్థానిక భాషల్లో ఉండే దిశగా చర్యలు

*పెండింగ్ కేసులు పరిష్కారానికి అందరూ సహకరించాలి

*1013 కేసులు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదలాయింపు

*జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
———————————————–
నందిమేడారం, ధర్మారం మండలం,
పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి -05:
————————–+——————–
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సంరక్షించే దిశగా మనమంతా కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.

ఆదివారం ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవిష్కరించేందుకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హై కోర్టు జడ్జీలు పి.నవీన్ రావు, అడ్మినిస్ట్రేషన్ జడ్జి ఎన్.వి శ్రవణ్ కుమార్, 14 మంది హై కోర్టు జడ్జిలు విచ్చేశారు.

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హై కోర్టు జడ్జిలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ రమా రాజేశ్వరి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. సురేష్ బాబులు స్వాగతం పలకగా, పండితులు వేదమంత్రాల మధ్య పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ, తనకు తెలుగు భాష పై మక్కువ ఉందని, చిన్నతనంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి ప్రసంగం విని, ఆయన హిందీ భాష పట్ల ఆశ్చర్యపోవడం జరిగిందని, తెలుగు భాషలో ఇంకా ఆకర్షణీయంగా మాట్లాడేవారు అని తెలిపారు. కోర్టులలో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటే మరింత చేరువగా న్యాయ వ్యవస్థ పని చేయగలుగుతుందని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఇటీవల నిర్వహించిన సమావేశంలో న్యాయ పుస్తకాలను తెలుగులో ముద్రించడం, తెలుగు భాషలో న్యాయ కోర్సులు, బోధనకు గల ఆవశ్యకత ప్రాముఖ్యతను వివరించారని అన్నారు. క్షేత్రస్థాయిలో, న్యాయస్థానాల్లో స్థానిక భాష ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు, ప్రజలలో నమ్మకం పెరుగుతాయని అన్నారు.

భాష కేవలం ఇతరులకు కమ్యూనికేట్ చేసే సాధనం మాత్రమేనని, దీనికి సంబంధించి గౌహతిలో జూనియర్ సెలక్షన్ కమిటీలో జరిగిన సంఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు. మంచి పరిజ్ఞానం ఉన్న జడ్జిలను తాను ఎంపిక చేసానని తెలిపారు. ముంబై హైకోర్టులో మరాఠీలో మరాఠి లో కోర్టు ప్రోసిడింగ్స్ అందజేస్తే అదనపు లాభాలు కలిగాయని,
అదేవిధంగా జిల్లా స్థాయిలో కోర్టులలో తెలుగులో ప్రొసీడింగ్స్ అందించేందుకు అవసరమైన చర్యలు ప్రణాళిక బద్ధంగా తీసుకోవడం జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పడటం చారిత్రాత్మిక అంశమని, దీనివల్ల ప్రజల సమీపంలో న్యాయం అందే అవకాశాలు మెరుగవు తాయని అన్నారు. హైకోర్టు జస్టిస్ పి. నవీన్ రావు గారి పట్ల ఉన్న గౌరవంతో 14 మంది హైకోర్టు జడ్జిలు వచ్చి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించడం తో మరింత శోభ సంతరించుకుందని అన్నారు. ‌ పెద్దపల్లి జిల్లా చాలా చారిత్రాత్మకమైన జిల్లా అని, రెండో శతాబ్దానికి చెందిన బౌద్ధ స్థూపాలు, ఓదెల మల్లికార్జున స్వామి, కమాన్ పూర్ ఆది వరాహస్వామి దేవాలయాలు, రామగిరి ఖిల్లా వంటి ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో 16 వేల 465 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, న్యాయవ్యవస్థలో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి మౌలిక వసతుల మెరుగుదల, నూతన కోర్టుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నా మని , న్యాయవాదులు, ప్రజలు సైతం సహకరించాలని ఆయన కోరారు.

న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరునికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా న్యాయ సేవలు తప్పనిసరిగా అందాలని తెలిపారు.

న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మనమంతా సమిష్టిగా పనిచేయాలని, కోర్టులో న్యాయవాదులు, జడ్జిల ప్రవర్తన మార్గదర్శకాలు మేరకు మర్యాద పూర్వకంగా ఉండాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించారు.

నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని త్వరగా తయారు చేసేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్, అధికార యంత్రానికి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపారు.

కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావు మాట్లాడుతూ, తన గ్రామంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోర్టులో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, ఒక్కో కేసు 20, 30 సంవత్సరాల పాటు సాగడం వల్ల ఎవరికి న్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో పాల్గొన్న అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎన్.వి. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, పెండింగ్ కేసుల పరిష్కారానికి సాంకేతికతను వినియోగిస్తూ నూతన కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నంది మేడారంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధికి 281 సివిల్ కేసులు, 732 క్రిమినల్ కేసులు మొత్తం 1013 కేసులు బదిలీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జి లను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రిన్సిపాల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు, పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. సురేష్ బాబు, సెక్రటరీ భాస్కర్, ప్రజాప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
—————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post