న్యూమోనియా అరికట్టేందుకు పీసీవీ టీకాలను చిన్నారులకు వేయించాలి ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న టీకాల కార్యక్రమం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్​

పత్రిక ప్రకటన తేదీ : 09–07–2021
===========================================
న్యూమోనియా అరికట్టేందుకు పీసీవీ టీకాలను చిన్నారులకు వేయించాలి
ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న టీకాల కార్యక్రమం
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్​
చిన్నపిల్లల్లో వచ్చే ప్రాణాంతక వ్యాధి అయిన న్యూమోనియాను అరికట్టడానికి రాష్ట్రంలో న్యూమోకోకల్​ కాంజువేట్​ వ్యాక్సిన్​ (పీసీవీ) టీకాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్ మాట్లాడుతూ… చిన్నపిల్లల్లో వచ్చే న్యూమోనియాను అరికట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా న్యూమోకోకల్​ కాంజువేట్​ వ్యాక్సిన్​ టీకాను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నట్లు వివరించారు ఈ టీకాను ఆరు వారాల వయసులో మొదటి డోసు, పద్నాలుగు వారాల వయసులో రెండో డోసు, తొమ్మిది నెల వయస్సులో బూస్టర్​ డోస్​ చొప్పున చిన్నారులకు వేయనున్నట్లు వివరించారు. ఈ విషయంలో డీఆర్​డీఏ అధికారులు జిల్లాలోని ఆయా గ్రామాల మహిళా సమాఖ్య సభ్యుల సహకారంతో ఈ వ్యాక్సిన్ నిర్వహణ విజయవంతం చేయాలని కోరారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వివరించాలని… అలాగే అంగన్​వాడీ టీచర్లు, ఐసీడీఎస్​ డిపార్ట్​మెంట్​ వారు, సీడీపీవోలు, అంగన్​వాడీ టీచర్లు ఆయా గ్రామాలు, పట్టణాల్లో చిన్నారులకు ఈ టీకాలు అందేలా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించాలని వివరించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జున్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం అందించే ఈ పీసీవీ టీకా ఉచితంగా అందచేయనున్నట్లు… అలాగే ఎంతో సురక్షితమైందని… పిల్లలకు ఇచ్చే పది వ్యాధి నిరోధక టీకాలతో పాటు ప్రస్తుతం ఈ టీకా పదకొండవ టీకా అని వివరించారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది వైద్య, ఆరోగ్య శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ ఎం. పల్లవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఆనంద్, డాక్టర్ నారాయణరావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, డీపీఆర్​వో, ఐసీడీఎస్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post