న్యూ గంజి వ్యవసాయ మార్కెట్ యార్డ్, నర్సింగ్ కళాశాల, నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయాల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన 2.   తేది:9.12.2021, వనపర్తి.

యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, రైతుల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు.
గురువారం వనపర్తి పరిధిలోని న్యూ గంజి వ్యవసాయ మార్కెట్ యార్డ్, నర్సింగ్ కళాశాల, నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేసి, వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులకు సూచించారు. యాసంగిలో రైతులు వరి వేయకుండా ఇతర ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేయాలని ఆమె వివరించారు.
ఐకేపీ ద్వారా 230 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వనపర్తి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయుటకు లక్ష్యంగా ఉండగా, 67 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఐకేపీ ద్వారా కొనుగోలు చేసినట్లు ఆమె వివరించారు. కేంద్రము (FCI) వరి ధాన్యం కొనుగోలు చేయబోమని నిర్ధారించినందున, రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ముగ్గు చూపాలని, వ్యవసాయ అధికారులు ప్రతి గ్రామాలలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు.
వనపర్తి జిల్లాలో 13 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేయుటకు లక్ష్యంగా ఉండగా, ఇప్పటి వరకు 8 వేల దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ సూచించారు. ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసినట్లయితే ప్రభుత్వం నుండి సబ్సిడీ అందుతుందని, వాటిని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ వివరించారు. ఆరుతడి పంటలైన వేరుశనగ, పెసలు, నువ్వులు, ఆముదం, కుసుమ, కూరగాయలు తదితర 10 రకాలైన పంటలను సాగు చేయాలని ఆమె సూచించారు.
వనపర్తి మార్కెట్ యార్డుకు బుధవారం 4713 బస్తాల వేరుశనగ సేకరించినట్లు, గరిష్ట రేటు రూ.7,417/- పలికినట్లు ఆమె వివరించారు. రైతులు నష్టపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, రైతుల్లో అవగాహన కల్పించి లాభదాయకమైన పంటలను సాగు చేసేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని ఆమె వివరించారు.
అనంతరం నర్సింగ్ కళాశాలను తనిఖీ చేసి, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన  పూర్తి చేయాలని జిల్లా అధికారులకు, కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ఆమె పరిశీలించారు. కార్యాలయ ఆవరణలో అందమైన పూల మొక్కలు నాటాలని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఈ దేశ్య నాయక్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, మార్కెటింగ్ అధికారి స్వరణ్ సింగ్, కాంట్రాక్టర్ రామారావు, దానయ్య, డాక్టర్ రాజ్ కుమార్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post