పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.

పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, జూన్ 2 నుంచి జూన్ 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలలో మన ప్రగతి చాటేలా విధంగా ఘనంగా నిర్వహించాలని అన్నారు. రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణ పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికల్లో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకొని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు, అందించిన సహాయంపై తెలియజేయాలని, భోజన ఏర్పాట్లు ఉండాలని అన్నారు. జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ, భోజనాలు పకడ్బందీగా చేయాలని తెలిపారు. రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు జిల్లాలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు కావద్దని సీఎస్ అన్నారు. విద్యుత్ రంగంలో గత పరిస్థితి, నేడు సాధించిన ప్రగతి తెలియజేస్తూ నాడు- నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, పోలీస్ ఆధ్వర్యంలో సురక్షా దివస్, తెలంగాణ రన్ నిర్వహించాలని అన్నారు. పారిశ్రామిక ప్రగతి, సాగునీటి రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలని అన్నారు. జూన్ 9న సంక్షేమ సంబురాలు సందర్బంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండవ విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్న చోట ఇంటి పట్టాల పంపిణీ, బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం ప్రారంభించాలని అన్నారు. బీసి కుల వృత్తుల ఆర్థిక సహాయంపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు అందిస్తామని, దాని ప్రకారం లబ్దిదారులను ఎంపిక చేసి జూన్ 9న ప్రారంభించాలని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నూతన జిల్లాలు, మండలాలు, గ్రామాల వివరాలు తెలియజేయాలని, మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో సాధించిన ప్రగతి, క్రొత్త ఆసుపత్రుల ఏర్పాటు, అందిస్తున్న అదనపు సేవలను వివరించాలని, వైద్య, ఆరోగ్య శాఖ దినోత్సవం నాడు కేసిఆర్ న్యుట్రిషన్ కిట్ ప్రారంభించాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సాధించిన విజయాలు ఘనంగా చాటాలని సీఎస్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల సందర్బంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయాలని, సఫాయిన్న సలాం అన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. మిషన్ భగీరథ క్రింద ఇంటింటికి త్రాగునీటి సరఫరా, గిరిజనోత్సవం, పెరిగిన పచ్చదనం, విద్యాశాఖలో సాధించిన ప్రగతి పక్కాగా తెలియజేయాలని, ఆధ్యాత్మిక రంగంలో సాధించిన ప్రగతి , అమరుల సంస్కరణ కార్యక్రమాలు పకడ్బందీగా జరగాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలోని 129 రైతు వేదికల్లో రైతు దినోత్సవం నిర్వహిస్తామని, లైటింగ్ చేపట్టి, షామియానా లు ఏర్పాటు చేస్తామని అన్నారు. రోజువారి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు విజయవంతంగా చేపడతామన్నారు. జిల్లాలో అన్ని శాఖల ద్వారా సాధించిన ప్రగతి వివరించేలా పకడ్బందీగా దశాబ్ది వేడుకలను నిర్వహిస్తామని అన్నారు.

ఈ సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు రాధిక గుప్తా, మయాంక్ సింగ్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post