పకడ్బందీగా ఆహార భద్రతా చట్టం అమలు:: రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి

జనగామ, అక్టోబర్ 5: జిల్లాలో ఆహార భద్రతా చట్టం-2013 ను పకడ్బందీగా అమలుచేయాలని, అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ చైర్మన్ కె. తిరుమల్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తో కలిసి ఆహార భద్రతా చట్టం-2013 అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికి ఆహార భద్రత కల్పించే కృషి చేయాలన్నారు. దేశంలో ఆకలి చావులు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతి పేదవానికి ఆహార భద్రత కల్పించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని, అవి లబ్ధిదారులకు సక్రమంగా, సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. జిల్లాలో ఆహార భద్రతా చట్టం అమలుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటుచేసామన్నారు. లబ్దిదారులకు అందిస్తున్న సేవలు, అందులోని లోపాలు, మౌళిక సదుపాయాల కల్పనకు సంబంధించి సూచనలు, సలహాలు తీసుకోవడంతోపాటు, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కమిషన్ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కమీషన్ కృషితోనే ఇటీవల ప్రభుత్వం 3 లక్షల పైచిలుకు క్రొత్తగా రేషన్ కార్డులు అందజేసిందన్నారు. క్రొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లో రేషన్ షాపుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారం అందించాలని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గ్రుడ్లు, పౌష్టికాహారం అందజేతపై ఫిర్యాదులు లేకుండా చూడాలన్నారు. అర్హులైన లబ్దిదారులందరికి కేసీఆర్ కిట్లు అందజేయాలన్నారు. రేషన్ షాపులో లభిస్తున్న సరుకులకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. దేశంలో 58 శాతం మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారని, పుట్టిన శిశువులు చాలా బలహీనంగా పడుతున్నారని ఆయన అన్నారు. గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చట్టం పై అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి అవగాహన కల్గివుండాలని, లబ్దిదారులకు చట్టం, చట్టం ద్వారా కల్పించబడిన హక్కులపై అవగాహన కల్పించి, చైతన్యం తేవాలన్నారు. చట్టం అమలుపై సోషల్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. నాణ్యమైన ఆహారం, సరసమైన ధరలో, అందుబాటులో వుండే విధంగా చూడాలని, సాంస్కృతిక, సామాజిక పరిమితులను గౌరవించే విధంగా ఉండాలని చైర్మన్ స్పష్టం చేశారు. అన్ని వర్గాలవారు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 335 రేషన్ షాపుల ద్వారా లక్షా 62 వేల 868 ఆహార భద్రత కార్డుదారులకు నిత్యావసరాలను అందిస్తున్నామన్నారు. 695 అంగన్వాడీ కేంద్రాలుండగా, ఇందులో 0 నుండి 6 సంవత్సరాల పిల్లలు 23 వేల 39, గర్భిణులు 4 వేల 10, బాలింతలు 3 వేల 207 మందికి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. పిల్లల ఎదుగుదల సర్వే రిపోర్టుల ప్రకారం జిల్లాలో 410 అతి తీవ్ర పోషణ లోపం, ఒక వేయి 526 మంది మధ్య తరహా పోషణ లోపం కల పిల్లలను గుర్తించి, ప్రతి ఒక్కరి వివరాలు తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లతో సహా సేకరించి, వారిని ప్రత్యేక ప్రణాళిక తో ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేపట్టి పోషణ లోపం నుండి విముక్తి కి చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో 526 ప్రభుత్వ పాఠశాలల్లోని 42 వేల 849 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 73 శాతం విద్యార్థుల హాజరు ఉన్నట్లు, కోవిడ్ నియంత్రణ చర్యలను ఖచ్చితంగా పాటిస్తున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఇప్పటివరకు ఒక వేయి 734 మంది లబ్దిదారులకు కేసీఆర్ కిట్లు అందజేశామన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా అధికార యంత్రాంగం కంకణబద్ధులై కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి, జిల్లా విద్యాధికారి కె. రాము, జిల్లా పౌరసరఫరాల అధికారిణి రోజారాణి, జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, అధికారులు, ఎంపిడివోలు, తహశీల్దార్లు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post