పకడ్బందీగా ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధిత శాఖల అధికారులు పూర్తీ ఏర్పాట్లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎక్సమినేషన్ నిర్వహణ పై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 25 నుండి నవంబర్ 2 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలను సమర్థవంతంగా ఎలాంటి లోపలకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు రాయాల్సి ఉంటుందని, మొదటి సంవత్సరం ఏ కళాశాలలో పరీక్షా ఫీజు చెల్లించారో అక్కడనే పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఆయా శాఖల అధికారులు సమన్వయ సహకారం అందించి పరీక్షలను నిర్ణిత సమయానికి, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని అన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో హై పవర్ కమిటీ, పరీక్షల నిర్వహణకు జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి నేతృత్వంలో కమిటీ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 9,930 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందులో 8,891 మంది జనరల్, 1,039 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. జిల్లాలో 47 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ ల ఆధ్వర్యంలో ప్రశ్నపత్రాలను ఆయా కేంద్రాలకు పంపించాలని, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలని, పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలని తెలిపారు. రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలనీ తెలిపారు. 47 కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్ లను, డిపార్ట్మెంటల్ అధికారులను, అదనపు చీఫ్ సూపెరిండెంటింగ్ లను నియమించాలని, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయాలనీ, కస్టోడియం లను నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా ఆయా పరీక్షా కేంద్రాలలో కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులను థర్మల్ స్క్రీనింగ్ చేయాలనీ, పరీక్షా కేంద్రాల లోపలి వెళ్లే సమయంలో శానిటైజ్ చేయించాలని, మాస్క్ లు ధరించడం, సామజిక దూరం పాటించడం వంటివి నిర్వహించాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఐసోలేషన్ వార్డ్ ను ఏర్పాటు చేయాలనీ, పరీక్షా కేంద్రంలోని గదులలో హైపో క్లోరైడ్ పిచికారీ చేయించాలని అన్నారు. పరీక్షా కేంద్రాలలో వైద్య సిబ్బందిని నియమించాలని, త్రాగునీరు, ఫర్నిచర్ సమకూర్చాలని అన్నారు. విద్యార్థులకు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా బాలికలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. పరీక్షల నిర్వహణ అనంతరం జవాబు పత్రాల బండల్స్ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుండి ఆదిలాబాద్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి చేరుకునే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందు చేరుకునే విధంగా బస్సులను ఏర్పాటు చేయాలనీ అన్నారు. పరీక్షా నిర్వహణ సమయం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థులు వారి హాల్ టికెట్ లను https:tsbie.cgg.gov.in, https:bietelangana.cgg.gov.in వెబ్ సైట్ ల ద్వారా డౌన్ చేసుకోవాలని తెలిపారు. ఏదైనా సమస్యలకు గాని, సమాచారం కోసం గాని జిల్లా ఇంటర్మీడియేట్ విద్య శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08732-297115, 9848781808 లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని, లేదా ఈ మెయిల్ : dieo.adilabad@gmail.com లకు సమస్యను తెలుపవచ్చని అన్నారు. అంతకు ముందు జిల్లా ఇంటర్మీడియేట్ విద్య శాఖ అధికారి సి.రవీందర్ కుమార్ పరీక్షల నిర్వహణపై సమావేశంలో వివరించారు. ఈ సమావేశం లో అదనపు ఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా విద్య శాఖ అధికారి ప్రణీత, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post