పకడ్బందీగా ఓటరు నమోదు జాబితా తయారు చేయాలి:: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్

ప్రచురణార్థం-1
ఓటర్ హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి
జనగామ, డిసెంబర్ 22: జిల్లాలో ప్రత్యేక ఓటరు నమోదు కు సంబంధించిన క్లెయిమ్ లను పరిష్కరించి పకడ్బందీగా తుది ఓటరు జాబితా తయారుచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓటరు ధృవీకరణ, ఓటరు జాబితా తయారీ, గరుడ యాప్ వంటి పలు అంశాలపై సిఇఓ బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జిఐఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు సవరణలు తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని, వచ్చే శుక్రవారంలోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆయన అన్నారు. జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యతపై కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని డిగ్రీ/వృత్తి నైపుణ్య కళాశాలలో ఎలక్టోరల్ లిటిరస్ క్లబ్బులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని, స్విప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గరుడ యాప్ వినియోగిస్తూ పరిష్కరించాలని, వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఈవిఎం గోడౌన్లను ప్రతి మాసం తనిఖీ చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, జిల్లాలో 16990 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో వివిధ కారణాల వల్ల 728 తిరస్కరించామని, 15250 పరిష్కరించామని, 1011 పెండింగులో ఉన్నాయని, పెండింగు దరఖాస్తులు వారం రోజుల్లో పరిష్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, ఎస్డిసి మాలతి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ఏతేషాం అలీ, అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు.

Share This Post