పకడ్బందీగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు.

పకడ్బందీగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు.

గురువారం హైదరాబాదు నుండి విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు,విద్యా, అనుబంధ శాఖల అధికారులతో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల సంసద్దతపై జిల్లాల వారీగా సమీక్షించి, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఆమె సూచించారు.

పరీక్ష సమయానికి ముందుగా వచ్చిన విద్యార్థులను వచ్చినవారిని వచ్చినట్లుగా కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాలలో పరీక్షకు ముందు, పరీక్ష జరిగిన తర్వాత గదులను, ఫర్నిచర్ ను విధిగా శానిటైజ్ చేయాలని సూచించారు. కలెక్టర్లు తమకు అందుబాటులో ఉన్న కేంద్రాలను తనిఖీ చేయాలని మంత్రి తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారితో మాత్రమే ఎగ్జామినేషన్స్ నిర్వహించేలా చూడాలని తెలిపారు. అన్ని జాగ్రత్తలతో పరీక్షలను నిర్వహిస్తున్నందున విద్యార్థుల
తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.

జిల్లాలో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంత్రికి తెలిపారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 16,255 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు.

మొత్తం 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు,20 ప్రైవేట్ కళాశాలల్లో, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, 7 ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

పరీక్ష పత్రాల నిల్వకు 18 స్టోరేజీ పాయింట్స్ ఏర్పాటు చేశామని, 54 మంది చీప్ సూపర్డెంట్స్,20 మంది అదనపు చీఫ్ సూపరిండెంట్స్ 54 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్,సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ 3 టీమ్స్ ను ఏర్పాటు చేసామని, మంత్రికి వివరించారు. అనుబంధ శాఖలతో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు.

అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఉన్నాయని ,ఫర్నిచర్ పూర్తిస్థాయిలో ఉందని తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష సెంటర్ల చుట్టుపక్కల గల జిరాక్స్ సెంటర్లను మూసి వేసేలా ఉత్తర్వులు జారీ చేసామని తెలిపారు.

ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏఎన్ఎం శానిటైజర్, మాస్కులు ,ఫస్ట్ ఎయిడ్ కిట్, ధర్మల్ స్కానర్ తో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకునేలా ఆయా ప్రాంతాల నుండి బస్సులను నడిపేలా ఆర్టీసీ వారికి , పరీక్ష సమయంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేసేలా విద్యుత్ అధికారులకు సూచించామని మంత్రికి తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుండి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post