పకడ్బందీగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ:: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 8:-

ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకలు

జాతీయ సమైక్యత పెంపోందించేలా వేడుకల నిర్వహణ

563 సినిమా థియేటర్లలో పిల్లలకు గాంధీ చిత్ర ప్రదర్శన

ఇంటీంటా జాతీయ పతాకం ఎగుర వేయాలి

వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్

పకడ్బందీగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై శనివారం డీజిపీ మహెందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి (ప్రభుత్వ & ప్రైవేట్) సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ప్రతి సినిమా థియేటర్ గాంధీ సినిమా సాటిలైట్ లింక్ రేపటి వరకు డౌన్ లోడ్ చేసుకోవాలని, దీనిని తహసిల్దార్ , ఎస్.హెచ్.ఒ ధృవీకరించాలని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ఆగస్టు 12 న ప్రతి సిటీ కేబుల్ ఛానల్ లో దేశ భక్తి పెంపోందించే కార్యక్రమాలు టెలికాస్ట్ చేయాలని, వీటీకి సంబంధించిన లింక్ లను డిపిఆర్వోల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీ లలో 2648 బృందాలు ఏర్పాటు చేశామని, వీటి ద్వారా ఇంటింటికి జాతీయ పతాకం పంపిణీ పూర్తి చేయాలని, ఆగస్టు 10న ప్రతి మున్సిపాలిటీ లో ఫ్రీడం పార్క్ ఏర్పాటు చేయాలని, ఆగస్టు 11న ఫ్రీడం రన్ ఉదయం 6.30 గంటలకు నిర్వహించాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణ మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు గాంధీ సినిమా థియేటర్లలో చూపించాలని ఆమె ఆదేశించారు. ప్రతి పాఠశాలలో క్రీడా పోటీలు, వ్యాసరచన, పెయింటింగ్, సింగింగ్ పోటిలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి రోజూ పాఠశాలలో అసెంబ్లీ నిర్వహించి జాతీయ గీతంతో పాటు దేశ భక్తి పాటలు పాడించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 10న మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేయాలని పేర్కొన్నారు

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీ, ఎంపీపీ లు, రైతు బంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడం కోసం సమరయోధులు అనేక త్యాగాలు చేసారని, వాటిని నేటి తరానికి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని సూచించారు. వజ్రోత్సవ వేడుకలు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో సైతం జరగాలని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా గాంధీ సినిమా చూపించాలని సీఎస్ పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి ఇంటి పై జాతీయ పతాకం ఎగుర వేయాలని, ఆగస్టు 9 నుంచి జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎస్ సూచించారు. ఆగస్టు 10న జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డు లో మొక్కలు నాటాలని తెలిపారు. ప్రతి అంగన్ వాడి కేంద్రాలలో సైతం వేడుకలు నిర్వహించాలని, ఆగస్టు 19న ప్రతి అనాథ శరణాలయంలో, వృథాశ్రమాలలో, ఆసుపత్రిలో పండ్లు స్వీట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆగస్టు 17న ప్రతి నియోజకవర్గ పరిధిలో రక్త దానం శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లాలో నిస్వార్థంగా ఉన్నతమైన వైద్య సేవలు అందిస్తున్న ఒక వైద్యుడుని గుర్తించి ఆగస్టు 15న సత్కరించాలని ఆయన సూచించారు. జాతీయ సమైక్యత పెంచే విధంగా వేడుకలు నిర్వహించాలని, ఎలాంటి అసాంఘిక శక్తులు రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సిబ్బంది గుర్తించి ప్రశంసా పత్రం అందజేయాలని సూచించారు.

సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఆదేశాలు గ్రహించినట్లు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అధ్యక్షతన జిల్లాలో సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు. . గాంధీ సినిమా ప్రదర్శన కోసం జిల్లాలో 19 సినిమా థియేటర్లు సిద్ధంగా ఉన్నాయని, రేపటి వరకు లింక్ డౌన్ లోడ్ పూర్తవుతుందని తెలిపారు. వజ్రొత్సవ వేడుకలకు సంబంధించి కార్యక్రమాల అమలుకు సంబంధించి, ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపినట్లు ఆయన అన్నారు. ఉద్యోగులనుభాగస్వామ్యం చేస్తున్నట్లు, వేడుకల విజయవంతానికి సూచనలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, సమన్వయ సమావేశం నిర్వహించుకున్నట్లు, సిబ్బంది అందరినీ భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా చర్యలు చేపట్టి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, మధుసూదన్, అదనపు డిసిపి షబరీష్, జెడ్పి సిఇఓ అప్పారావు, డిపివో హరిప్రసాద్, డిఇఓ యాదయ్య, డీఆర్డీవో విద్యాచందన, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post