పట్టణంలోని రాజీవ్ చౌక్ లో రైతుబంధు సంబరాలలో భాగంగా ట్రాక్టర్ ర్యాలీ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన.    తేది:11.01.2022, వనపర్తి.

తెలంగాణలో రైతుబంధు సంబరాలు ద్వారా రైతుల ఆత్మ గౌరవం మరింత పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
మంగళవారం వనపర్తి పట్టణంలోని రాజీవ్ చౌక్ లో రైతు సంబరాలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా రైతుబంధు కార్యక్రమాన్ని అభినందిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 8 విడతలుగా రైతులకు రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుదని ఆయన సూచించారు. ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలలో రూ. 50 వేల 6 వందల కోట్ల నిధులను రైతుల ఖాతాలకు మళ్ళించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు వచ్చి తమకు నచ్చిన పంటలు సాగు చేస్తూ, ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రైతు బంధు పథకం 2018 ఆగస్టు 15న ప్రారంభించి చిన్న, సన్నకారు రైతులకు రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని మంత్రి సూచించారు. ప్రస్తుతం 7 ఎకరాల రైతుల వరకు వారి ఖాతాలో డబ్బులు జమ చేయబడ్డాయని, మిగతా రైతులకు బ్యాంకు సెలవుల అనంతరం వారి వారి ఖాతాలలో జమ చేస్తారని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తాను మంత్రి అయ్యాక వ్యవసాయ శాఖను తీర్చిదిద్ది రైతులను అత్యున్నత స్థానంలో నిలబెట్టెందుకు కృషి చేస్తున్నాను ఆయన తెలిపారు. నేడు గ్రామ గ్రామాన రైతు సంబరాలు పెద్దఎత్తున నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్న దని, ప్రతి రైతు ఆత్మగౌరవంతో బ్రతకాలని కోరుతున్నట్లు మంత్రి వివరించారు.
ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో వరి పంట ఒక కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యిందని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్. సి. ఐ. ద్వారా సేకరించిన వరి ధాన్యంలో మన రాష్ట్రం నుండి 54 శాతం సేకరించిందని మంత్రి వివరించారు. వనపర్తి జిల్లాలో దాదాపు ఒక లక్ష 15 వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు 32 లక్షల ఎకరాలకు వరి సాగు చేయగా, ప్రస్తుతం ఒక కోటి ఆరు లక్షల ఎకరాలకు విస్తరించిందని, ఇది హర్షించదగ్గ విషయమని మంత్రి అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని, తద్వారా రైతులు ఆర్థికపరంగా అభివృద్ధి సాధించాలని మంత్రి తెలిపారు.
అంతకు ముందు రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీనీ నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎద్దుల బండిపైన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, వ్యవసాయ రంగం నిర్విరామంగా పని చేస్తుందని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, రైతు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ,పోతనపల్లి రాజు సింగిల్విండో చైర్మన్ వెంకట రావు, వైస్ చైర్మన్ రాజు, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, మోసిన్ బిన్ అమర్, జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు, ఎం.పి.పి. లు, ఎంపిటిసిలు, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post