పట్టణాలలో పచ్చదనం-పారిశుద్ధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.

పట్టణాలలో పచ్చదనం-పారిశుద్ధ్యం వెల్లివిరియాలని, ప్రణాళికాబద్ధమైన ప్రగతి జరగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.సోమవారం తన కార్యాలయంలో 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంపై రంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లను, మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్ల, కమిషనర్లతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన సేవలు అందాలని, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా అడుగులు వేయాలని, ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జూన్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని , పట్టణ ప్రగతి కార్యక్రమంలో కమిషనర్లు, చైర్మన్లు, మేయర్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతిపాదించిన వైకుంఠ దామాలను సత్వరమే పూర్తి చేయాలని ,మిషన్ భగీరథ పథకంలో భాగంగా వైకుంఠ దామాలకు నీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వార్డుల వారీగా పట్టణ ప్రగతి జరగాలని, అందుకోసం ప్రత్యేకంగా వార్డుకు ఒక అధికారిని నియమించి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. వార్డుల్లో విరివిగా మొక్కలు నాటాలి, హరిత ప్రణాళికను రూపొందించుకోవాలి, వార్డుల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా ఆట స్థలాలను గుర్తించి అభివృద్ధి చేయాలని, ఇప్పటికే పనులు ప్రారంభమైన సమీకృత మార్కెట్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు ప్రస్తుత కార్యాచరణ రూపొందించుకొని పనులు చేపట్టాలని, పట్టణాభివృద్ధి శాఖ, నీటి సరఫరా విభాగం అధికారులు సమన్వయంతో వ్యవహరించి నీటి సరఫరా పైపులైన్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అనంతరం రోడ్ల నిర్మాణాన్ని చేపడతామని అని మంత్రి తెలిపారు. గత వర్షాకాలంలో సమస్యలు ఎదురైనందున రానున్న వర్షాకాలంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ 4 వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గ్రౌడింగ్ చేయాలని వైకుంఠ దామాలు పూర్తి చేయాలని, పబ్లిక్ టాయిలెట్లు వినియోగం లోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. హరిత హారం లో భాగంగా ప్రతి కాలనీలో, ప్రతి వీధిలో అవెన్యూ ప్లాంటేషన్ పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం పై శ్రద్ధ వహించాలని. 4 వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ మరియు శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ వివిధ మున్సిపాలిటీల మేయర్లు,చైర్పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు.
—————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి రంగారెడ్డి జిల్లా గారిచే జారీ చేయనైనది.

 

 

 

 

Share This Post