పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల సమగ్రాభివృద్ది   సైకిల్ పై మంత్రి పువ్వాడ… ఖమ్మం వీధుల్లో పర్యటన..

ప్రచురణార్థం

ఖమ్మం, జూన్ 3:

పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాల సమగ్రాభివృద్ది సాకారమవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పట్టణాలు స్వీయ నేతృత్వంలో బాగుచేసుకోవాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఉదయాన్నే సైకిల్ పై ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 37, 41, 52, 53 డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. నగర వీధుల్లో తిరుగుతూ పారిశుధ్యం, విద్యుత్ స్తంభాలు, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్ బోర్లు, డివైడర్లు, సెంట్రల్ డివైడర్లలో ఉన్న మొక్కలు, సైడ్ కాల్వలు పరిశీలించి అక్కడ చెత్తను స్వయంగా తొలగించి స్ధానిక ప్రజలతో మాట్లాడారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకుని, పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల గూర్చి స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు సైకిల్ పై పర్యటిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుమారు రెండు గంటల పాటు ఒకటో పట్టణం, రెండవ పట్టణ ప్రాంతంలోని డివిజన్లలో పర్యటించారు. రోడ్లు, మురుగు కాలువలు, ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులపై అధికారులతో చర్చించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి సైకిల్‌పై క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని ఆయన అన్నారు. స్వయంగా పరిశీలించడం ద్వారా ఇప్పటి వరకు చాలా సమస్యలు పరిష్కరించామని చెప్పారు. ప్రజాసమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడమే ఈ పర్యటన ఉద్దేశమని, ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని మంత్రి వివరించారు. గుర్తించిన ప్రతి పనిని ప్రస్తుత పట్టణ ప్రగతిలో పరిష్కరిస్తామని, ఇలాంటి పనులు పరిష్కరించుకోవడానికి పట్టణ ప్రగతి మంచి అవకాశమని అన్నారు.
అనంతరం స్థానిక పాత మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయం సందర్శించి, సిటి లైబ్రరి ఏర్పాటుకు చర్యల గురించి పరిశీలించారు. సిటి లైబ్రరీ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రణాళికాబద్దంగా పట్టణ ప్రగతి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్ లో 3 తెలంగాణా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన సమస్యలు పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకోల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, స్దానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post