పట్టణ వార్డుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 23: జనగామ పట్టణంలో వార్డుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వార్డు ప్రత్యేక అధికారులతో పట్టణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 16న పట్టణంలోని 30 వార్డుల్లో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వందశాతం వ్యాక్సినేషన్ కి ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. పట్టణంలో 13 వేల 491 గృహాలు ఉండగా, ఇందులో 36 వేల 681 మంది 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని గుర్తించామన్నారు. ఇప్పటివరకు 19 వేల 594 మంది మొదటి డోస్, 14 వేల 966 మంది రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆయన అన్నారు. ఇంకనూ వ్యాక్సిన్ తీసుకొనని 3 వేల 119 మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా కార్యాచరణ చేయాలన్నారు. వార్డుల్లో కాలనీల వారీగా ఎంతమందికి ఇంకనూ వ్యాక్సిన్ ఇవ్వాలనేది చూసి, వార్డుల వారీగా వచ్చే రెండు, మూడు రోజుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పూర్తయిన కాలనీల్లో ప్రజాప్రతినిధులతో సంబురాలు చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు ఉన్నచోట వైద్య శాఖ సిబ్బంది వెళ్ళి, వ్యాక్సిన్ తీసుకొనేలా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జనగామ ఆర్డీవో మధు మోహన్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, ఉప జిల్లా వైద్య ఆరోగ్యాధికారిణి డా. కరుణశ్రీ, వార్డు ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post