పత్తి కొనుగోలు కోసం అవసరమైన ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

2021-22 సంవత్సరానికి గాను పత్తి కొనుగోళ్ళ కోసం కొనుగోలు కేంద్రాలలో రైతుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు కొనుగోలు కార్యచరణ రూపొందించుకొని సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో పత్తి కొనుగోళ్ళపై వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు, పత్తి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ళ కోసం పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్‌ మిల్లులో అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పత్తి విక్రయానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఒక క్వింటాల్‌కు 6 వేల 25 రూపాయలు మద్ధతు ధర ప్రకటించడం జరిగిందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో పత్తి పంట విక్రయించి లబ్టి పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి గజానంద్, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు, కొనుగోలు కేంద్రాల
నిర్వాహకులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post