పత్తి కొనుగోళ్ళకు ఏర్పాట్లు పూర్తీ చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

వానాకాలం పత్తి పంట కొనుగోళ్లను త్వరలో ప్రారంభిస్తామని, సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తీ చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం పత్తి కొనుగోళ్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, రైతు సంఘాల నాయకులు, వ్యాపారస్తులు, సీసీఐ అధికారులతో ముందస్తు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్న బహిరంగ మార్కెట్ లో ఎక్కువ ధర ఉందని తెలిపారు. సమావేశంలో వివిధ వర్గాల వారు తెలియపరచిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా కొనుగోళ్లను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్కెటింగ్, వ్యవసాయం, ట్రాన్స్ పోర్ట్, తూనికలు-కొలతలు, అగ్నిమాపక సిబ్బంది వారి విధులను నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని, మార్కెట్ యార్డులలో తేమ యంత్రాలను, తూకం చేసుకోవాలని అన్నారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగునీరు, ఇతర ఏర్పాట్లను చేపట్టాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. వ్యాపారస్తులు రైతులవద్ద నుండి కొనుగోలు చేసే పత్తికి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలనీ తెలిపారు. అన్ని శాఖల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారంతో రైతుల కోసం పని చేయాలనీ అన్నారు. ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న మాట్లాడుతూ, ఈ నెల 20 నుండి పత్తి కొనుగోళ్లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని రైతులు పండించిన పత్తి పంటకు ఎక్కువ ధర కల్పిస్తూ కొనుగోలు చేయాలనీ వ్యాపారస్తులను కోరారు. రాబోయే రోజుల్లో సీసీఐ మార్క్ ఫెడ్ ల ద్వారా కమర్షియల్ ఆపరేషన్ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని కోరారు. జిల్లాలోని పరిస్థితులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి వివరిస్తామని తెలిపారు. సీసీఐ నిబంధనల ప్రకారమే ప్రయివేట్ వ్యాపారస్తులు పత్తి కొనుగోళ్లు చేయడం జరుగుతుందని తెలిపారు. వచ్చే సంవత్సరం నుండి మార్కెట్ యార్డ్ లు కొనుగోళ్లకు సిద్ధం చేసి ప్రకటన చేయాలనీ, తద్వారా రైతులు మార్కెట్ లకు పత్తిని అమ్మకానికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఏరోజుకారోజు కొనుగోళ్లు చేసే పత్తి ధరలను జిల్లాలోని అన్ని గ్రామపంచాయితీలు, రైతు వేదికల వద్ద ప్రకటించాలని తెలిపారు. అంతకు ముందు రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాలు పడిన నేపథ్యంలో తేమ శాతాన్ని చూడకుండా కొనుగోలు చేయాలనీ, స్వామినాథన్ కమిషన్ పేర్కొన్న మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాలనీ తెలిపారు. ఇప్పటికే వర్షాల వలన రైతులు నష్టపోయారని, దిగుబడి తగ్గిందని, సీసీఐ కమర్షియల్ కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. గిరిజన ప్రాంతాల లోని రైతులు మద్దతు ధర తెలియకపోవడం, తూకాల్లో మోసం వలన నష్టపోతున్నారని వారికీ అవగాహన కల్పించాలని కిసాన్ మిత్ర ప్రతినిధులు కోరారు. జిల్లాలోని పత్తి కొనుగోలు వ్యాపారస్తులు మాట్లాడుతూ, రైతుల వద్ద నుండి కొనుగోలు చేసే పత్తికి మెడల్ ధర కల్పించి కొనుగోలు చేస్తామని తెలిపారు. రవాణా చార్జీల సమస్యను పరిష్కరించాలని కోరారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మల్లేశం మాట్లాడుతూ, పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ వానాకాలం సీజన్ లో జిల్లాలో పత్తి పంట సాగు తగ్గిందని తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ సంవత్సరం 3 లక్షల 83 వేల 251 ఎకరాలలో పత్తి సాగు జరిగిందని సుమారు 25 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని మార్కెట్ యార్డులలో పత్తి కొనుగోళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పత్తి కొనుగోళ్ళకు సంబంధించి పోస్టర్ లను ప్రజాప్రతినిధులు, అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, సీసీఐ మేనేజర్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆశ కుమారి, జిల్లా రవాణా అధికారి పి.శ్రీనివాస్, రైతులు, రైతు సంఘాల నాయకులు, వ్యాపారస్తులు, సీసీఐ, రవాణా, పోలీస్, అగ్నిమాపక, వ్యవసాయ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post