పత్తి కొనుగోళ్ళకు మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు పూర్తీ చేయండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం కాటన్ సీజన్ లో ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ, పత్తి కొనుగోళ్లు చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం ప్రైవేట్ ట్రేడర్స్ మద్దతు ధర ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని, అయినప్పటికీ మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్ళకు సంబందించిన ఏర్పాట్లు పూర్తీ చేయాలనీ అన్నారు. భద్రత ఏర్పాట్లు అగ్నిమాపక శాఖ ద్వారా చేపట్టాలని, తూనికలు కొలతల శాఖ ద్వారా తూకం వేసే యంత్రాలను సరిచూసుకోవాలి అన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. త్వరలో ప్రజాప్రతినిధులు, రైతు నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సీసీఐ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో రైతులకు సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా అధికారులు రవాణా, లేబర్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అన్నారు. అగ్నిమాపక, తూనికలు కొలతల శాఖల ద్వారా ఏర్పాట్లు పూర్తీ చేయాలని అన్నారు. జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరిస్తూ జిల్లాలో ఈ వానాకాలం సీజన్ లో 3 లక్షల 83 వేల 251 ఎకరాలలో పత్తి సాగు చేయడం జరుగుతున్నదని, సుమారు 27 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డులలో పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తీ చేయడం జరుగుతున్నదని, తూకం యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్, త్రాగునీరు, తదితర ఏర్పాట్లను చేపడతామని తెలిపారు. జిల్లాలో 64 వేల 460 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 41 గోదాం లు ఉన్నాయని తెలిపారు. కొనుగోళ్లలో ఏమైనా సమస్యలు తలెత్తినపుడు జిల్లా స్థాయి కమిటీ చర్చించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు సీసీఐ ద్వారా జిన్నింగ్ మిల్లుల టెండర్ ప్రక్రియ జరుగుతున్నదని తెలిపారు. బహిరంగ మార్కెట్ లో పత్తి ధర ఎక్కువగా ఉందని, ప్రస్తుతం సీసీఐ మద్దతు ధర క్వింటాలుకు 6025 రూపాయలు మాత్రమే ఉందని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రమేష్, సీసీఐ అసిస్టెంట్ మేనేజర్ హరీష్ కపూర్, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు, అగ్నిమాపక, తూనికలు కొలతల అధికారులు, కిసాన్ మిత్ర ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post