పత్రికా ప్రకటన**ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శకంగా నిర్వహించాలి – రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్*

నల్గొండ,డిసెంబర్ 11.  ఈనెల 14న నిర్వహించే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం చేపట్టాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య ( డి. ఆర్ డి .ఎ) భవనం లో కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఈనెల 14న ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6:30 కల్లా కౌంటింగ్ కేంద్రంలో రిపోర్టు చేయాలని అన్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని అన్నారు. లేనిచో కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన కోవిడ్ పరీక్షా కేంద్రంలోపరీక్షించి, నెగెటివ్ రఉన్నవారినే లోనికి అనుమతిస్తామని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమం ప్రకారం ఓటర్లు ఓటు వేస్తారని, కాబట్టి కౌంటింగ్ లో భాగంగా మొదట ప్రారంభ లెక్కింపు చేపడతామన్నారు. కౌంటింగ్ కోసం నాలుగు టేబుల్ లను ఏర్పాటు చేశామన్నారు  ప్రారంభం లెక్కింపులో మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. ప్రారంభ లెక్కింపు అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మొదటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కిస్తామని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావలసిన కోటాను నిర్ధారిస్తామని అన్నారు. ఎవరైనా అభ్యర్ది కోటాకు సరిపడు ఓట్లను సాధించినట్లయితే అతనిని గెలుపొందినట్లుగా ప్రకటిస్తామని, ఏ అభ్యర్థికీ కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే తదుపరి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతామని అన్నారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాను సాధించేవరకు చేపడతామన్నారు. ఏ అభ్యర్థికీ కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్, ఆర్.డి.ఓ. జగదీశ్వర్ రెడ్డి కలెక్టరేట్ ఏవో మోతిలాల్, నల్లగొండ మండల తహశీల్దార్ మందడి నాగార్జున్ రెడ్డి, ఎన్నికల డీటీ విజయ్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు తరాల పరమేష్, బాలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post