పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి

పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి

జిల్లా కలెక్టర్లు, పోలీస్, విద్యా శాఖ అధికారులతో పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి

————————————-
సిరిసిల్ల 28, ఏప్రిల్ 2022:
————————————-

జిల్లాలో నిర్వహించబోయే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, తదితర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మే 6 వ తేదీ నుండి మే 24 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మే 23 వ తేదీ నుండి జూన్ 1 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులను ఆదేశించారు. పరీక్షలు రాసే విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. వేసవి కాలం నేపథ్యంలో ప్రతీ పరీక్షా కేంద్రంలో త్రాగు నీరు, వైద్య శిబిరం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే సీసీ కెమెరాలు ఉండేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

పరీక్షలు రాసే విద్యార్థినీ, విద్యార్థులు మనోధైర్యం కోల్పోకుండా, మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రత్యేక నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ అందించేందుకు గాను రాష్ట్ర విద్యా శాఖ తరపున 18005999333 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ టోల్ ఫ్రీ నెంబర్ గురించి విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు.

జిల్లాలో పరీక్షల నిర్వహణకు సంబంధించి సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందులో 6,379 మంది రెగ్యులర్ విద్యార్థులు, 5 మంది ప్రైవేట్ గా విద్యార్థులు, మొత్తం 6,384 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించి మొదటి సంవత్సరం 4,474 మంది, రెండో సంవత్సరం 4,462 మంది మొత్తం 8,936 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. దీనికోసం 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు గాను తగిన చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు.

జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ద్వారా తగిన చర్యలు చేపడుతామని అన్నారు. ప్రశ్నపత్రాలు పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష కేంద్రానికి తరలించేందుకు పోలీస్ ఎస్కార్ట్ పంపించడం జరుగుతుందని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఈఓ డి.రాధా కిషన్, డీఐఈఓ మోహన్, డీఎంహెచ్ఓ డా.సుమన్ మోహన్ రావు, బీసీ సంక్షేమ అధికారి మోహన్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి కె. భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

———————————————-
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post