పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
గురువారం పదవ తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా వార్షిక పరీక్షలు నిర్వహించలేదని ఈ సంవత్సరం పరీక్షలు ప్రత్యేక పరిస్థితులలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు 9,07,396 మంది విద్యార్థులు, పదవ తరగతి పరీక్షలు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతారని మంత్రి తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. మే నెలలో ఎండల తీవ్రత అధికంగా ఉండటంవల్ల విద్యార్థులకు సమస్యలు రాకుండా పరీక్ష కేంద్రానికి విద్యార్థులు సమయానికి చేరుకునే విధంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. పరీక్ష అనంతరం విద్యార్థులు ఇంటికి క్షేమంగా చేరుకునే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాసే ముందు ఎవరైనా ఆందోళనకు గురైతే అలాంటి విద్యార్థులకు అక్కడే మాట్లాడి మానసిక ధైర్యం కల్పించే విధంగా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో హైదరాబాద్ లో ముగ్గురు మానసిక వైద్య నిపుణులను ఏర్పాటుచేసి టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆందోళన చెందే విద్యార్థులను టోల్ ఫ్రీ నెంబర్ 1800-5999333 నెంబరుకు విద్యార్థులతో మాట్లాడించాలని ఈ నెంబరు ప్రతి పరీక్ష సెంటర్ ప్రిన్సిపాల్ వద్ద ఉండే విధంగా చూడాలన్నారు. పరీక్ష నిర్వహణ అధికారులు నిర్లక్ష్యానికి తావు తెలుకుండా పోలీస్, రెవెన్యూ, వైద్య, పోస్టల్ శాఖ అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ మే 6 నుండి 24 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు, మే 23, 2022 నుండి జూన్ 1 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షా కేంద్రాలు 283, ఇంటర్మీడియేట్ పరీక్షా కేంద్రాలు 156 ఏర్పాటు చేయడం జరిగిందని, 31 పోలీసు స్టేషన్ లలో పదవ తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలు, 29 పోలీసు స్టేషన్ లలో ఇంటర్మీడియేట్ పరీక్షల ప్రశ్న పత్రాలు భద్రపరుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేయడం జరిగిందని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామని, పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరాతోపాటు, ప్రతి కేంద్రము వద్ద ప్రాథమిక చికిత్స అందించుటకు అవసరమైన మందులు, ఓ.ఆర్ .ఎస్. ప్యాకెట్లతో ఎ.ఎన్.ఎమ్ లు, ఆశా వర్కర్లను అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. ఎలాంటి అవాంఛ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ ను అమలు అలాగే పరిసర ప్రాంతంలో గల జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చర్యలు చేపడుతామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా వైద్య అధికారి స్వరాజ్య లక్ష్మి, సైబరబాద్ కమిషనరేట్ డి.సి.పి.శిల్పవల్లి, ఏ.సి.పి.శంకర్, జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి వెంక్య నాయక్, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా ట్రేజరీ అధికారి, కలెక్టరేట్ కార్యాలయ తహసీల్దార్ జయశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.