పరిపూర్ణమైన ఓటర్ జాబితాకు రాజకీయ పార్టీలు సహకరించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 07, 2021ఆదిలాబాదు:-

            పరిపూర్ణమైన ఓటర్ జాబితాకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 1, 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, అందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్ల నమోదు కార్యక్రమముతో పాటు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని 582 పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారులు ఉంటారని, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ లను నియమించాలని కోరారు. బూత్ స్థాయి అధికారులకు, బూత్ స్థాయి ఏజెంట్ లకు సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని తెలిపారు. వచ్చే ఓటర్ దినోత్సవం నాటికీ పరిపూర్ణమైన ఓటర్ జాబితాను తయారు చేయడానికి రాజకీయ పార్టీల జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. వివిధ పార్టీల నాయకులు, ప్రతినిధులు లేవనేత్తిన అంశాలపై సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారి, రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తప్పులు లేని ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు.  ఇప్పటికే ప్రారంభమైన ప్రీ రివిజన్ కార్యక్రమాలు అక్టోబర్ 31 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఇందులో పలు మార్లు పేరు నమోదు, బూత్ స్థాయి అధికారులు ఇంటింటి పరిశీలన, పూర్తి సమాచారం సేకరణ, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ జరుగుతుందని తెలిపారు. నవంబర్ 1 న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. నవంబర్ 1 నుండి 30 వరకు ఇట్టి జాబితాలో ఆక్షేపణలు, అభ్యంతరాలు తెలుపవచ్చని అన్నారు. డిశంబర్ 20 న అట్టి ఆక్షేపణలు, అభ్యంతరాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జనవరి 5, 2022 నాడు చివరి ఓటర్ జాబితాను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అంతకు ముందు మాస్టర్ ట్రైనర్ లక్షణ్ ఓటర్ నమోదు కార్యక్రమంపై వివరంగా తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ జాడి రాజేశ్వర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post