ప్రచురణార్ధం.
ఆగష్టు 24 ఖమ్మం :
పరిశ్రమలను విస్తరింపజేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధికల్పించడంలో ప్రాధాన్యతనిచ్చే పరిశ్రమలదారులకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సబ్సిడీలను, ప్రోత్సాహకాలను కల్పిస్తున్నదని తదనుగుణంగా జిల్లాలోని వివిధ పరిశ్రమలలో స్థానిక యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో డిస్ట్రీక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వహణ, ఆయా పరిశ్రమలలో స్థానిక యువతకు కల్పించబడిన ఉపాధి అవకాశాలు, నూతన పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి అనుమతులు జారీ తదితర అంశాలపై అనుబంధ శాఖల అధికారులు, వివిధ పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తల అభీష్టం మేరకు పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించిందని, ప్రస్తుతం జిల్లాలో గల పరిశ్రమలలలో అధిక శాతం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించి స్లాబ్ కటింగ్, టైల్స్, ఫ్లోరింగ్ తదితర వృత్తుల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు “నాక్” ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 68 రైస్ మిల్లులు, 450 కు పైగా గ్రానైట్ యూనిట్లు, 150 కుపైగా టైల్స్ యూనిట్లతో పాటు కోల్డ్ స్టోరేజ్ లు కూడా ఉన్నాయని వీటిలో వృత్తి నైపుణం కలిగిన వారితో పాటు ఇతర విభాగాలలో పనిచేసుకొనెందుకు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో మొదటి ప్రాధాన్యతనివ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో టి.ఎస్.ఐ. పాస్ ద్వారా పరిశ్రమల స్థాపన అనుమతుల కొరకు వివిధ శాఖలకు చేసుకున్న దరఖాస్తులపై సత్వర చర్యలు చేపట్టి అనుమతులను వెంటనే జారీచేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. టి.ఎస్.ఐ. పాస్ కింద, విద్యుత్, కాలుష్యనియంత్రణ, ఫ్యాక్టరీలు, టౌన్ ప్లానింగ్ తదితర శాఖాధికారులకు అందిన దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించారు. పరిశ్రమదారులను ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు ఉండాలని, నియమ నిబంధనలననుసరించి సత్వరమే అనుమతులు జారీచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా పరిశ్రమల మేనేజర్ యం. హరిప్రసాద్, విద్యుత్ శాఖ డి ఇ రామారావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రవిశంకర్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణ నాయక్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, టి.ఎస్.ఐ. పాస్ జోనల్ మేనేజర్ పవన్ కుమార్, లీడా బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ సురేష్ బాబు, అగ్నిమాపక శాఖాధికారి జయప్రకాష్ రైస్ మిల్లర్ల అసోసియోషన్ అధ్యక్షులు బొమ్మరాజేశ్వరరావు, గ్రానైట్, కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.