పరీక్షలు సజావుగా నిర్వహించాలి – డీఈఓ రమేష్ కుమార్

పరీక్షలు సజావుగా నిర్వహించాలి  – డీఈఓ రమేష్ కుమార్

ఎలక్షన్లు, పరీక్షలు ఈ రెండు సునిశితమైన అంశాలని, ఏ చిన్న పొరపాటు జరిగినా మూల్యం చెల్లించక తప్పదని, కాబట్టి అధికారులు మనసుపెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ కుమార్ కోరారు. మే 23 నుండి జూన్ 1 వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా కేంద్రం వారీగా నియమించిన చీఫ్ సూపరింటెండెంట్ లకు, డిపార్ట్మెంట్ అధికారులకు నిర్వహించిన ఒక రోజు పునక్షరణ శిక్షణ తరగతులలో ఆయన పరీక్షల నిర్వహణ తీరుపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 11,399 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని, అందుకోసం 73 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఒక్కో కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంట్ అధికారిని నియమించాలని, వారు ఆయా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షలు సజావుగా, సాఫీగా నిర్వహించేలా కృషి చేయాలని కోరారు. పరీక్షా కేంద్రాలలో సీటింగ్ ఏర్పాట్లు, మంచి నీటి సౌకర్యం, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, ఏ.యెన్.ఏం. ల ఏర్పాటు వంటివి చూసుకోవాలని అన్నారు. పొలిసు స్టేషన్ నుండి ప్రశ్నా పత్రాలు వచ్చిన తరువాత విద్యార్థులకు పంపిణి, పరీక్ష అనంతరం పొలిసు బందోబస్తుతో తరలించడం వంటివి పక్కాగా చేయాలని, అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి తమ కేంద్రాల ఏ.యెన్.ఏం. పోలిసుల మొబైల్ నెంబర్లు తీసుకోవాలని సూచించారు.
కరోనా తరువాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మొదటగా నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 12 పేపర్ల నుండి 6 పేపర్లకు కుదించడంతో పాటు పరీక్షా సమయం కూడా అరగంట ఎక్కువ పెంచిందని అన్నారు. కాబట్టి విద్యార్థులు సుష్టిగా భోజనం చేసి (కడుపునిండా ) అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు, సిబ్బంది ఎవరు కూడా పరీక్షా కేంద్రాలకు చరవాణి తీసుకెళ్ళుటకు అనుమతి లేదన్న విషయాన్ని విస్మరించరాదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ సులభంగానే ఉంటుందన్న భావన విడనాడాలని, ఏ చిన్న పొరపాటు చేసిన చాలా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని , కాబట్టి అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తతో ఉంటూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించుటలో సహకరించవలసినదిగా చేశారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ రామేశ్వర్ ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, సెక్టోరల్ అధికారి సుభాష్, సూర్యప్రకాష్, ఏం.ఈ.ఓ.లు నీలకంఠం, యాదగిరి, బిచ్యా నాయక్, చీఫ్ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post