పర్యాటక ఆకర్షణ కు కార్యాచరణ-అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

పర్యాటక ఆకర్షణ కు కార్యాచరణ-అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని రాబోయే కాలంలో జిల్లాను పర్యాటక ఆకర్షణ ప్రాంతంగా, తీర్చిదిద్దుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, విజ్ఞాన సముపార్జన కలిగించే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మన నాగరికత, సంస్కృతి, జీవనశైలి విధానాన్ని ముందుతరాలకు తెలుపవచ్చని అన్నారు. మన జిల్లాలో ఏడుపాయల, తునికిలో నల్లపోచమ్మ, మెదక్ చర్చి వంటి దర్శనీయ స్థలాలతో పాటు మెదక్ ఖిల్లా, నర్సాపూర్ అర్బన్ పార్క్, పోచారం అభయారణ్యం, జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం,

పార్కు, వంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి పరచడం ద్వారా పర్యాటకులను విశేషంగా ఆకర్షించవచ్చని అన్నారు. హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండడం వలన చాలా మంది పర్యాటకులు నర్సాపూర్ అర్బన్ పార్కు సందర్శిస్తున్నారని, వారు జిల్లాలోని మిగతా పర్యాటక ప్రాంతాలు సందర్శించే విధంగా బస చేయుటకు కాటేజీలు, క్యాటరింగ్, రవాణా వంటి అన్ని విధాల సౌకర్యాలు కల్పన దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు.
అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ రాబోయే ఒకటిన్నర సంవత్సర కాలంలో జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లా కలెక్టర్ హరీష్ అద్భుతమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. వారంత సెలవులలో పర్యాటకులు ఉల్లాసంగా గడపడానికి సెలయేర్లు, పార్కుల వంటి వాటితో పాటు దర్శనీయ స్థలాలు, విజ్ఞానం అందించే వివాహార యాత్రలు చేపట్టేలా టూరిజం ప్యాకేజి రూపొందించనున్నామని అన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలలో మాదిరే పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తే జిల్లా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడం తో పాటు ఆదాయం సమకూరుతుందని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి పలువురు అధికారులు సలహాలు, సూచనలు ఇచ్చారు.
అనంతరం పర్యాటక రంగం ఆవశ్యకత పై పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన 10 మంది విజేతలకు, మహిళా సమాఖ్యలకు నిర్వహించిన ఐదు రకాల పోటీలలో గెలుపొందిన 10 మంది విజేతలకు అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లు ప్రశంసా పత్రాలు అందజేశారు. తరువాత పట్టణంలోని సందర్శనీయ ప్రాంతాలను తిలకించుటకు 20 మంది విజేతలతో వెళ్లుచున్న మినీ బస్సును అదనపు కలెక్టర్లు జండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ., పర్యాటక అభివృద్ధి అధికారి శ్రీనివాస్, డి.ఈ.ఓ. రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, డి .పి .ఓ. తరుణ్ కుమార్, అదనపు డి.ఆర్.డ్డి.ఓ. భీమయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, ఏడుపాయల ఈ.ఓ. శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post