పర్యాటక కేంద్రంగా పోచారం

పర్యాటక కేంద్రంగా పోచారం

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, కనీస మౌలిక వసతులు కల్పిస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమ సింగ్, ఆర్.డి.ఓ. సాయి రామ్, డి.ఎఫ్.ఓ. జ్ఞానేశ్వర్ తో కలిసి హవేలీ ఘనపూర్ మండలంలో పోచారం డ్యామ్ ను, రెండు అతిధి గృహాలను పరిశీలించారు. అనంతరం జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని సఫారీ వాహనంలో తిరిగి అక్కడ ఉన్న పక్షులు, జింకలు, నెమళ్ళు, అడవి పందులను పరిశీలించి వాచ్ టవర్ ఎక్కి పోచారం రిజర్వాయర్ లో ఉన్నటువంటి ఐ ల్యాండ్ ను బైనాక్యులర్ తో పరిశీలించారు. అనంతరం వన విజ్ఞాన కేంద్రం లో నీటి పారుదల, పర్యాటక రంగ అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో పోచారం అభయారణ్యంతో పాటు, మెదక్ ఖిల్లా, మెదక్ చర్చ్, ఏడుపాయల వంటి ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుటకు ఎన్నో అవకాశాలున్నాయని, వీటినన్నిటిని కలుపుతూ ఒక సర్క్యూట్ గా అభివృద్ధి పరిస్తే విశేషంగా పర్యాటకువలను ఆకర్షించవచ్చని అన్నారు. త్వరలో పోచారం డ్యామ్ లో పర్యాటకుల కోసం బోట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నామని అన్నారు. పోచారం డ్యామ్ మధ్యలో ఉన్న సుమారు ఐదు ఎకరాల ఐ ల్యాండ్ ను అభివృద్ధి పరచి రెస్టారెంట్ , అడ్వెంచర్ గేమ్స్ వంటివి ఏర్పాటు చేయడంతో పాటు లక్కవరం లో మాదిరి కేబుల్ బ్రిడ్జ్ లేదా కేబుల్ కార్ ను ఇక్కడ ఏర్పాటు చేయుటకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయవలసినదిగా అధికారులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న రెండు గెస్ట్ హౌజ్ లను పునరుద్ధరించుటకు లేదా పర్యాటక శాఖకు బదలాయించి అభివృద్ధి పరచుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామని అన్నారు. మెదక్ ఖిల్లా పై ఒకఆకర్షణీయమైన వ్యూ పాయింట్ ఏర్పాటు చేస్తే చూడచక్కగా ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పర్యాటక రంగ అభివృద్ధికి మౌలిక వసతులు, తదితర వాటికి త్వరలో ఒక పధకాన్ని రూపొందించనున్నదని , ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నీటి పారుదల ఇంజనీరింగ్ అధికారులు, పురావస్తు శాఖ, పర్యాటక రంగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post