పల్లెప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి, కీసర మండలం తిమ్మాయిపల్లిలో పల్లెప్రగతిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీశ్,

పత్రిక ప్రకటన

తేదీ : 03–06–2022

 

పల్లెప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి,

కీసర మండలం తిమ్మాయిపల్లిలో పల్లెప్రగతిలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీశ్,

గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా నర్సరీ, వైకుంఠధామాల పరిశీలన,

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కారం కానట్లయితే సంబంధిత సర్పంచ్లు, అధికారులు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శుక్రవారం కీసర మండలంలోని తిమ్మాయిపల్లిలో ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయంతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. తిమ్మాయిపల్లిలో సుమారు రెండువేల జనాభా ఉంటుందని గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు అవసరమైన కార్యక్రమాలను పల్లె ప్రగతి ద్వారా చేయించాలని కలెక్టర్ పేర్కొన్నారు. తిమ్మాయిపల్లి గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సర్పంచ్ పెంటయ్యను అడిగి తెలుసుకొన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామసభలు నిర్వహించాలని అప్పుడే గ్రామంలో ఉన సమస్యలు తెలుస్తాయని ఈ గ్రామసభలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని  ముఖ్యంగా విద్యుత్తు శాఖ అధికారులు తప్పకుండా పాల్గొని గ్రామంలో ఎక్కడ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు  అవసరమో తెలుసుకోవడంతో పాటు విద్యుత్తు వైర్లు సరి చేయాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను తెలియజేస్తే వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు.  గ్రామంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ పెంటయ్య, పంచాయతీ కార్యదర్శి పావనికి కలెక్టర్ సూచించారు. అనంతరం హరితహారంలో వీలైనంత ఎక్కువగా మొక్కలను నాటాలని వెంటనే వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాలు, ఖాళీ ప్రదేశాలు, ఇళ్ళ వద్ద, రోడ్డుకు ఇరువైపులా, లేఅవుట్లలో మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. హరితహారం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలని సీఎం కలలను నిజం చేయాలని కలెక్టర్ అన్నారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించిన కలెక్టర్ హరీశ్ ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు పెంచారు ? ఎలాంటి మొక్కలు నర్సరీలో ఉన్నాయి ? వాటి పెంపకం ఎలా జరుగుతోంది ? గ్రామస్తులకు ఎన్ని మొక్కలను నాటేందుకు అందించారనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. నర్సరీల్లో ప్రజలకు అవసరమైన మొక్కలు ఉండేలా చూడాలని వారు కోరిన మొక్కలను ఇంటికే పంపించేలా ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవో పద్మావతి, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి వివరించారు. అనంతరం గ్రామంలోని వైకుంఠధామాన్ని కలెక్టర్ పరిశీలించారు. వైకుంఠధామంలో పిచ్చిమొక్కలు మొలచి ఆవరణ అపరిశుభ్రంగా ఉందని వెంటనే పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. వైకుంఠధామంలో కూడా ఖాళీ ప్రదేశం ఉన్న చోట్ల మొక్కలు నాటాలని అక్కడ నీటి వసతి, తదితర సౌకర్యాలు కల్పించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని దీనికిగాను నిధులను వినియోగించుకొని వైకుంఠధామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయాలని అందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జడ్పీ సీఈవో దేవసహాయం, డిపీవో రమణమూర్తి, డిసిఓ , శ్రీనివాస్, ఎంపీడీవో పద్మావతి, తిమ్మాయిపల్లి సర్పంచ్ పెంటయ్య, పంచాయతీ కార్యదర్శి పావని, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

 

 

Share This Post