పల్లె అభివృద్ధి పనుల పురోగతిపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ మనూ చౌదరి

మండలాల కేటాయించిన హరితహారం టార్గెట్ ను 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యం. మనూ చౌదరి ఏపీఓ లను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీఓలు, ఈసీలతో హరితహారం, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, మొక్కల ఆన్లైన్ నమోదుపై సమావేశం నిర్వహించారు.
గ్రామీణ అభివృద్ధి శాఖకు హరిత హారంలో కేటాయించిన 47 లక్షల మొక్కల లక్ష్యాన్ని ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇప్పటివరకు 40 లక్షల మొక్కలు నాటాలని నాటిన ఉపాధి హామీ కూలీలకు డబ్బులు చెల్లించుటకు కేవలం 8 లక్షల 19వేల మొక్కలను మాత్రమే ఆన్లైన్లో నమోదు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆన్లైన్ నమోదు లో నిర్లక్ష్యం వహించిన తెల్కపల్లి, ఉర్కొండ, పదర మండలాల ఏపీఓలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
జిల్లాలో కొనసాగాలంటే అభివృద్ధి పనులు పురోగతి సాధించేలా విధులు నిర్వహించాలని లేకుంటే జిల్లాను వదిలి వెళ్లాలని కలెక్టర్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
పురోగతి పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నెల చివరి నాటికి హరిత హారంలో 100% మొక్కలను నాటాలి అన్నారు.
జిల్లాలోని జిల్లా కేంద్రం నుండి ప్రధాన పట్టణాలకు వెళ్లి 250 కిలోమీటర్ల మేరకు ఉన్న ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.
నాటిన మొక్కలు ఎండిపోతే వెంటనే వాటి స్థానంలో వేరే మొక్కలను నాటాలని, టీ గార్డులను సరిచేసి ఒక కర్రను సపోర్టుగా ఏర్పాటు చేయాలన్నారు.
వచ్చే వారం నిర్వహించే సమావేశం నాటికి పురోగతి సాధించేలా మొక్కలు నాటి చెల్లింపులకు ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అదేవిధంగా 41 లక్షల రూపాయలతో ప్రతి మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనానికి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు.
నాగర్ కర్నూల్ మినహా అన్ని మండలాలకు స్థలాల కేటాయింపు పూర్తి అయిందని, ఈనెల 31 నాటికి బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.
ప్రతి మండలంలో ఎంపిక చేసిన పది ఎకరాల స్థలంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో పనులను త్వరగా పూర్తి చేసి మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
వనం చుట్టూ బయో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
8 కోట్ల 20 లక్షల రూపాయలతో ప్రతి మండలంలో ఏర్పాటు చేయనున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు.
పల్లె ప్రగతి పనుల్లో నిర్మిస్తున్న స్మశాన వాటికలు, తడి పొడి వేరుచేసే డంపింగ్ యార్డ్ షెడ్లు నిర్మాణాలను ఆగస్టు 31 నాటికి పూర్తి చేసి ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలన్నారు.
ఉపాధి హామీ కూలీలకు అందించే రోజువారీ కూలీలకు చెందిన పోస్టాఫీసుల్లో ఉన్న 4 కోట్ల 75 లక్షల 72వేల రూపాయలను బ్యాంకులకు బదలాయించి దాదాపు 52 వేల అకౌంట్లకు అందాల్సిన ఉపాధిహామీ కూలీల డబ్బులను చెల్లించేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా అప్పగించిన ప్రతి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జిల్లా అభివృద్ధికి పాటుపడే లా అధికారులు సమర్ధవంతంగా విధులను నిర్వహించాలని సూచించారు.
వచ్చే మంగళవారం నిర్వహించే సమీక్ష సమావేశానికి సమర్పించే ప్రగతి నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు ఉంటాయని పనులకు సమర్పించిన నివేదిక లకు వ్యత్యాసాలు ఉంటే చర్యలు ఉంటాయన్నారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ నర్సింగ్ రావు, అదనపు డిఆర్డిఓ నటరాజ్, సహాయ డిఆర్డివోలు శ్రీనివాస్, చంద్రశేఖర్, గ్రామీణాభివృద్ధి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post