పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి – జిల్లా కలెక్టర్ హరీష్

పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి – జిల్లా కలెక్టర్ హరీష్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల ప్రాధాన్యతను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై ఈ కతృవులు పాల్గొని విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ కోరారు. ఇటీవల కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ఆయా కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు, సిబ్బంది చిత్త శుద్ధితో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్య మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, కాబట్టి ఈ కార్యక్రమాలను మహా యజ్ఞంలా భావించి చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో జూన్ 3 నుండి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు త్వరలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమాల పై మునిసిపల్ కమీషనర్లు, మండల్ పరిషద్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమాల అమలును విజిలెన్స్ బృందాలు నిశితంగా పరిశీలిస్తూ నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్నాయని, కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉంటూ రాబోయే 20 రోజులు 24 గంటలు పనిచేయవలసి ఉంటుందని అన్నారు. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ జాతీయ రహదారులు, ప్రధాన రహదారులు, మండల రహదారుల వెంట పెద్ద మొక్కలు నాటాలని అన్నారు. మధ్య మధ్య పూల మొక్కలతో మూడు వరుసలలో ఎక్కడా గ్యాప్ లేకుండా జిగ్ జాగ్ పద్దతిలో అవెన్యూ ప్లాంటేషన్ చిక్కగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మునిసిపల్ ప్రాంతాలలో ప్రతి షాప్ దగ్గర దుకాణ యజమానులు మొక్కలు నాటి వాటి సంరక్షణ భాద్యత చేపట్టాలా చూడాలని లేకుంటే మునిసిపల్ కమీషనర్లు భాద్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. వివాదంలో, పెండింగులో ఉన్నసమస్యలను అధిగమించి వైకుంఠధామాల నిర్మాణాలను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వైకుంఠధామం చుట్టూ రెండు వరుసలలో బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, నీటి సౌకర్యం ఉండేలా చూడాలని, లేని పక్షంలో తక్షణమే ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులను సంప్రదించి ఏర్పాటు చేయాలని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై గ్రామ పంచాయతీ, వార్డు వారీగా రోజు వారి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్య కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలలో విరివిగా మొక్కలు నాటేలా చూడాలని అన్నారు. నిర్ణీత కాలవ్యవధి ప్రకారం మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. పల్లె ప్రగతి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయవలసినదిగా ఏం.పి .డి.ఓ.లకు సూచించారు. ప్రతి మండలంలో స్థలాలను గుర్తించి బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని అన్నారు. మునిసిపల్ ప్రాంతాలలో నర్సరీల సక్రమ నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులను కేటాయించామని వారి సేవలను ఉపయోగించుకోవలసినదిగా మునిసిపల్ కమీషనర్ల సూచించారు. పల్లె ప్రగతి పట్ల సంతృప్తి గా ఉన్న పట్టణ ప్రగతి బాగాలేదని, ఈ సారి కౌన్సిలర్ల భాగస్వామ్యం తో సిస్టమాటిక్ గా పనిచేయాలన్నారు. ప్రతి వార్డులో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా జూన్ 2 న ప్రతి మండలంలో, మునిసిపల్ వార్డులలో తెలంగాణా గ్రామీణ, పట్టణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ , జిల పరిషద్ సీఈఓ శైలేష్, డిఆర్ డిఓ శ్రీనివాస్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, నరసాపూర్ ఆర్.డి.ఓ. వెంకట ఉపేందర్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్లు, ఏం.పి .డి.ఓ.లు, ఏం.పి .ఓ.లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post