పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దమందడి మండలం మద్దిగట్ల, మోజెర్ల గ్రామాలలో పర్యటించి, ఆడపిల్లలకు అభయ హస్తం చెక్కుల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన                                                                         తేది:7.7. 2021
వనపర్తి

హరితహారం కార్యక్రమం ఒక యజ్ఞంలా సాగాలని, భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా మొక్కలు నాటాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామాలలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. ఆయా గ్రామాల సర్పంచులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె సూచించారు. హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆమె అన్నారు. నేడు మనం నాటిన మొక్క రేపటి వృక్షాలుగా మారి, మనకు నీడని ఇస్తాయని ఆమె తెలిపారు. హరితహారంలో నిర్దేశించిన మొక్కలను నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా మద్దిగట్ల గ్రామంలో ఆడపిల్లలకు అభయ హస్తం కార్యక్రమంలో పాల్గొని  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్రుణ హత్యలు నివారించాలని, ఆడపిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉన్నదని ఆమె తెలిపారు. ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లేలా మనం ప్రోత్సహించాలని, వారికి చేయూతనివ్వాలని ఆమె అన్నారు. ఆడపిల్లలకు మగవారితో సమానంగా అన్ని అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె తెలిపారు. ఆడపిల్ల పుట్టిన వెంటనే వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.11,116/- లు వారి పేరున చెక్కు రూపంలో సహాయం అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
అనంతరం యువజన సంఘం ఆధ్వర్యంలో ఆడపిల్లల కుటుంబానికి (7) మందికి రూ.11,116/- ల చెక్కులను ఆమె పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ.నరసింహులు, ఎంపీపీ మేఘారెడ్డి, జెడ్.పి.టి.సి. రఘుపతి రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజ ప్రకాష్ రెడ్డి, వైస్ ఎంపీపీ రఘు ప్రసాద్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………………
.జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి నుండి జారి చేయనైనది.

Share This Post