పల్లె ప్రగతితో గ్రామ రూపు రేఖలు మారుతున్నాయి :: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్థం

ఖమ్మం, జూన్ 7:

పల్లె ప్రగతి కార్యక్రమ అమలుతో గ్రామాల రూపు రేఖలు మారుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంత్రి రఘునాధపాలెం వాంకుడోతు తాండ, రాంక్యా తాండ, సూర్య తాండ లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం రాంక్యా తాండ లోని ప్రాధమిక పాటశాలలో ఏర్పాటుచేసిన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాంక్యా తండాలో రూ. 60.75 లక్షల రూపాయలతో నిర్మించిన సైడ్ కాల్వలు, సిసి రోడ్లు (18 పనులు) , వాంకుడోతు తాండలో రూ. 20.50 లక్షలతో నిర్మించిన సైడ్ కాల్వలు, సిసి రోడ్లకు (5 పనులు) ప్రారంభోత్సవం చేసినట్లు తెలిపారు. మూడు నెలల్లోనే పనులు ప్రారంభంచేసి పూర్తిచేసినట్లు ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం మరిన్ని నిధులు గ్రామాలకు రానున్నట్లు ఆయన తెలిపారు. రఘునాధపాలెం మండలంలో అన్ని గ్రామాల్లో సిసి రోడ్లు పూర్తిచేసుకున్నట్లు తెలిపారు. తండా లను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసినట్లు, 17 గ్రామ పంచాయతీలు వున్న రఘునాధపాలెం మండలంలో ఇప్పుడు 37 గ్రామ పంచాయతీలు చేసుకున్నట్లు ఆయన అన్నారు. వర్షాకాలం వస్తున్నందున గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా జ్వరాలు రాకుండా ముందే దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామి డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నట్లు, సర్పంచులు చేసిన పనులకు నిధులు విడుదల అయి, వారికి చెల్లింపులు చేసినట్లు ఆయన తెలిపారు. మొబైల్ లపై ఉంటున్న పిల్లలకు ఆహ్లాదం, ఆరోగ్యం కొరకు గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నట్లు, గ్రామాల్లో స్థల సేకరణ చేసి త్వరితగతిన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన ప్రాధమిక పాఠశాలలో గుర్తించిన పనులు, పెయింటింగ్ తో సహా పాఠశాల ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, గ్రామాల్లో కరంట్, నీటి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలోగా గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తిచేయాలన్నారు. ప్రభుత్వ భూమి లేనిచోట ప్రయివేటు భూమిలో ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో స్థలం పరిశుభ్రంగా ఉండడంతో పాటు రక్షణ ఉంటుందని, నిర్మాణాలు చేపట్టే సమయంలో వారి భూమి తిరిగి వారికి అప్పగించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ లక్ష్మి ప్రసన్న, ఖమ్మం ఆర్డివో రవీంద్రనాథ్, డిఆర్డివో విద్యా చందన, డిపివో హరిప్రసాద్, ఇఇ పిఆర్ శ్రీనివాస్, ఇఇ ఆర్ అండ్ బి శ్యాంప్రసాద్,మండల తహసిల్దార్ నర్సింహారావు, ఎంపిడివో రామకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post